ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ బిగ్ న్యూస్..! ఉచిత బస్సు వేళ సాయంపై ప్రకటన..!
ఏపీలో కూటమి సర్కార్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది లేకుండా పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆటో డ్రైవర్లకు ఎంత ఇస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై స్పష్టత ఇచ్చారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ దీని వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఇచ్చే సాయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర శ్రీకాకుళం పర్యటనలో కీలక ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్లకు 10 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటనతో సర్కార్ ఉద్దేశం వెల్లడైంది.

శ్రీకాకుళం జిల్లా పలాసలో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. త్వరలోనే ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. అలాగే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే 20 వేలలో 7 వేల రూపాయలు కూడా త్వరలో జమ చేస్తామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలనతో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే పథకాన్ని కూటమి సర్కార్ ఆగస్టు 15న ప్రారంభించనుంది. అయితే ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు అవకాశం కల్పిస్తారా లేక కేవలం జిల్లాల పరిధిలోనా, జిల్లాల పరిధిలో అయితే కొత్త జిల్లాల లెక్కనా, లేక పాత జిల్లాల లెక్కనా అనేది ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు ఈ పథకం ప్రారంభంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తప్పవన్న అంచనాల నేపథ్యంలో గతంలో వైసీపీ ప్రభుత్వం వాహన మిత్ర పథకానికి ఇచ్చిన ఏడాదికి 10 వేల రూపాయలే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications