అదే జరిగితే.. రాజకీయ సన్యాసం చేస్తా - నో డౌట్: తేల్చేసిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
విజయవాడ: తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయని, అవే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తాయని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. ఎక్కడా లేనివిధంగా నేరుగా ప్రజలకు నగదు బదిలీ అవుతోందని గుర్తు చేశారు. అవినీతి, లంచం అనేదే లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గానీ, ఇతర రాజకీయ ప్రత్యర్థి పార్టీలు గానీ ఎంత దుష్ప్రచారం చేసినా.. వాస్తవం ఇదేనని తేల్చి చెప్పారు.

కాలక్షేపం కోసం..
సంక్షేమ పథకాలపై టీడీపీ, ఇతర పార్టీలు చేస్తోన్నవన్నీ దుష్ప్రచారాలేనని ప్రజలకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి, వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని చెప్పే నాయకులు కాలక్షేప రాజకీయాలు చేస్తున్నట్టేనని ఎద్దేవా చేశారు. తాము ఫలానా పార్టీకే ఓటు వేస్తామని ప్రజలెవరూ చెప్పుకోరని, సమయం వచ్చినప్పుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు.

గెలుస్తామనే నమ్మకం ఉంది..
వైసీపీ పనై పోయిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతాం అంటూ టీవీ డిబేట్లల్లో తెలుగుదేశం, సహా ఇతర పార్టీల నాయకులు ఎన్నో చెబుతుంటారని, అవేవీ క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించవని అన్నారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని చెప్పే నాయకులు తన ఛాలెంజ్‌ను స్వీకరించగలరా? అని బైరెడ్డి ప్రశ్నించారు. ఇంకో 18 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో మళ్లీ బంపర్ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం తమకు ఉందని అన్నారు.

రాజకీయ సన్యాసం చేస్తారా?
వైఎస్ఆర్సీపీ గెలవకపోతే- జగన్ కోసం పని చేసే తనలాంటి నాయకులు, నియోజకవర్గాలను అభివృద్ధి చేసిన వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ గెలిస్తే- తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తోన్న ప్రత్యర్థి పార్టీల నాయకులు తన ఛాలెంజ్‌ను స్వీకరించగలరా? అని ప్రశ్నించారు. వైసీపీ ఓడిపోతే రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటారా? అని సవాల్ విసిరారు.

మంచి చేసిన పార్టీ ఓడిన చరిత్ర లేదు..
తమకు మంచి చేసిన పార్టీ, నాయకులను ప్రజలు ఓడించిన ఘటన చరిత్రలో లేదని బైరెడ్డి అన్నారు. కోట్లాదిమంది ప్రజలకు మంచి చేసిన తమ ముఖ్యమంత్రికి ప్రజల అండదండలతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. 2024లో జరిగేవి ధనవంతులు-పేదలు, తప్పుడు ప్రచారాలు- వాస్తవ పరిస్థితులు, నీతి-అవినీతి మధ్య జరిగే ఎన్నికలుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అభివర్ణించారు. మంచి వైపే ప్రజలు నిలుస్తారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications