వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాతో గేమ్‍‌లొద్దు, పెట్టుకుంటే..: సబ్బం వార్న్, సాక్షి పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
విశాఖపట్నం: తనతో ఆటలు ఆడవద్దని, ఇంకెవరితోనైనా మైండ్ గేమ్ ఆడుకోవచ్చునని, తనపై ఎదురుదాడికి దిగితే తాను సిద్ధమని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ఆదివారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. జగన్ తనపై ఎదురుదాడికి దిగితే తాను సిద్ధమని, ఆయన గురించి రోజు మాట్లాడేందుకు కావాల్సినంత సమాచారం తన వద్ద ఉందని ఘాటుగా స్పందించారు.

ఎవరితో అయినా మైండ్‌గేమ్ ఆడొచ్చని, చంద్రబాబుతో, కాంగ్రెస్‌తో, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మైండ్ గేమ్ ఆడినట్టు తనతో మాత్రం ఆడొద్దన్నారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపేయాలని, తన వ్యవహారం తనది, వారి వ్యవహారం వారిదని, లేదు అంటే తాను సిద్ధమన్నారు. ప్రతి రోజూ ప్రెస్‌మీట్ పెట్టుకుందామన్నా తనకు అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల వరకూ ప్రతిరోజూ జగన్ గురించి చెప్పగల సమాచారం తన వద్ద ఉందన్నారు.

జగన్ మైండ్ గేమ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణుల వ్యవహార శైలిపై సుతిమెత్తగా ప్రారంభించి తర్వాత గట్టి హెచ్చరికలు చేశారు. తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరైనా తన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి వ్యతిరేకంగా మాట్లాడే అలవాటు తనకు లేదని కానీ, నాలుగు రోజుల కిందట జగన్ గురించి మాట్లాడినప్పుడు ఆ పార్టీ శ్రేణులు స్పందించి తన దిష్టిబొమ్మలు దహనం చేశాయని, జగన్ మైండ్ గేమ్‌లలో ఇదొకటన్నారు. ఆ రోజు తాను మాట్లాడింది ఆయన పత్రికలో రాలేదని, పైగా తనకు వ్యతిరేకంగా కథనం వచ్చిందన్నారు.

తాను చెప్పింది సింగిల్ కాలమ్ రాసి, తనకు వ్యతిరేకంగా రెండు పేజీలు రాసుకున్నా తనకు అభ్యంతరం లేదని, దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాన్ని ఔట్ సోర్సింగ్‌కు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తన దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని కొనసాగిస్తే తనకు అభ్యంతరం లేదని అయితే, 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి రోజూ మీ దిష్టిబొమ్మలు దహనం చేసే పనిని ఔట్ సోర్సింగ్‌కు ఇస్తానన్నారు. తాను టికెట్ అడిగితే జగన్ నిరాకరించారని ఆ పార్టీ నేతలు అంటున్నారని కానీ, తాను ఎన్నడూ ఎంపీ సీటు కోసం జగన్‌ను అడగలేదన్నారు.

పార్టీ, పత్రిక విషయంలో జగన్‌కు అనేక విషయాలు చెప్పానని, సలహాలు ఇచ్చానని తెలిపారు. కొన్ని తప్పు అని చెప్పానని వివరించారు. తన మాట వినకపోవడం వల్లే జగన్ పత్రిక సర్క్యులేషన్ ఏడు లక్షలకు పడిపోయిందని సబ్బం హరి స్పష్టం చేశారు. గతంతో పోల్చితే జగన్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. ఒకప్పుడు ఇతరులకు అందనంత ఎత్తులో ఉన్న వ్యక్తికి ఇప్పుడెందుకీ పరిస్థితి ఎదురైందో ఆలోచించుకోవాలని హితవు పలికారు.

పాత స్నేహితుడిగా ఇంతటితో ఆపేద్దామని సూచిస్తున్నానన్నారు. జగన్ మంచోడని సర్టిఫికెట్ ఇవ్వనని, పార్టీలో తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారంతా జగన్ గైడెన్స్‌తోనే మాట్లాడతారన్నారు. వైయస్ పేరును సిబిఐ చార్జిషీట్‌లో పెట్టినప్పుడు ఆ పార్టీలో అందరూ రాజీనామా చేశారని, ఆ సమయంలో వైవి సుబ్బారెడ్డి తనకు ఫోన్ చేసి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని చెప్పారని, అప్పుడు ఖాళీ లెటర్ హెడ్‌పై సంతకం చేసి పంపితే, జగన్ వద్దన్నారని చెప్పారు.

జగన్‌ను అరెస్టు చేసిన సమయంలో తాను రాజీనామా చేయలేదన్నారు. ఆర్థిక నేరంపై ఒకరిని అరెస్టు చేసినప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేయడం సరైంది కాదని ఊరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపడానికి విశాల హృదయం ఉండాలని సబ్బం హరి వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర విషయంలో మనసు మార్చుకోవాలని జగన్‌కు సూచించారు. అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా విజయమ్మ విఫలమయ్యారన్నారు.

ఆమె తనకు తల్లితో సమానమని, ఆమెను కించపరచడానికి ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. రాష్ట్ర విభజనపై పంతాలకు పోవద్దని కాంగ్రెస్ అధిష్ఠానానికి సబ్బం హరి సూచించారు. విభజన బిల్లులో లోపాలున్నాయని, సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని బిజెపి కార్యవర్గ సమావేశం అభిప్రాయపడడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో యూపిఏకు పూర్తి మెజారిటీ లేదని, బిజెపి సహకరిస్తున్నందున విభజన బిల్లు పార్లమెంటులో పెడతామని యూపిఏ చెబుతోందని కానీ, బిజెపి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలో తీసుకుని పంతాలకు పోవద్దన్నారు.

అసెంబ్లీలో బిల్లుపై చర్చకు మరో నెల సమయం కావాలని కిరణ్ కోరిన నేపథ్యంలో చర్చ పూర్తయ్యేలోపు పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతాయని, ఒకవేళ రాష్ట్రపతి మూడు వారాల సమయం ఇచ్చినా పార్లమెంటు ఆమోదానికి సమయం సరిపోదని వివరించారు. ఆరుగురు ఎంపీలం త్వరలో బిజెపి పార్లమెంటరీ పక్షనేత సుష్మా స్వరాజ్‌ను కలుస్తామని చెప్పారు.

English summary
Anakapalli MP Sabbam Hari on Sunday warned YSR 
 
 Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X