ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్వీప్-వైసీపీ నేతలతో సజ్జల ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల తర్వాత నోరు విప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీపీలతో భేటీ అయిన ఆయన.. వారికి దిశానిర్ధేశం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారు, కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చాయని సజ్జల గుర్తుచేశారు.
వైసీపీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అని, పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ కాదని ఎంపీపీలకు సజ్జల తెలిపారు. అభిమానులతో నడిచే పార్టీ ఇది, అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ ఇది అన్నారు. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉందన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉందని సజ్జల తెలిపారు. వైఎస్సార్‌సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారని సజ్జల మండిపడ్డారు. ఐదారు నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నామన్నారు. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు.

2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదని, ఆ తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారని, కానీ తాము మాత్రం ఎప్పుడూ జనంలోనే ఉన్నామని సజ్జల గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉందని, ప్రజల కోసం మళ్లీ ముందుకు రావాలని సజ్జల పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయని, ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారని సజ్జల ఆరోపించారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక రోజుకో కొత్త ఇష్యూతో రచ్చ చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై సజ్జల విమర్శలు గుప్పించారు. చివరికి తిరుపతి లడ్డూ మీద కూడా రాజకీయం చేశారన్నారు.
తమ హయాంలో చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ స్వీప్ చేసే అవకాశం ఉందని సజ్జల చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications