వైసీపీ టార్గెట్ క్లియర్ - రూల్స్ కంటే అదే ముఖ్యం-ఏజెంట్లకు సజ్జల కీలక సూచన..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఈసీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న జరిగే కౌంటింగ్ కోసం అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే పోల్ మేనేజ్ మెంట్ తరహాలోనే కౌంటింగ్ డే మేనేజ్ మెంట్ కూడా చేయగలిగితేనే ఎన్నికల్లో తమకు గెలుపు సాధ్యమని భావిస్తున్న పార్టీలు ఆ మేరకు ఏజెంట్లకు శిక్షణ నిర్వహిస్తున్నాయి. అందులోనూ అధికార పార్టీ అయిన వైసీపీ.. తమ ఏజెంట్లకు చేసిన సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.
కౌంటింగ్ రోజు వైసీపీ వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లాస్ నిర్వహించారు. ఇందులో ఆయన.. కౌంటింగ్ రోజు ఏజెంట్లు ఏం చేయాలో చెప్పేశారు. రూల్స్ పేరుతో ఏ ఒక్క ఓటునూ వదిలేయొద్దని వారికి కీలక సూచన చేశారు. వైసీపీ టార్గెట్ ఏంటో తెలుసుకుని కౌంటింగ్ రోజు పని చేయాలన్నారు. ముందుగా నిబంధనలు తెలుసుకుని ప్రత్యర్థులను ఎలా అడ్డుకోవాలో చూడాలన్నారు.

రూల్స్ అంటూ మడికట్టుకుని కూర్చోవద్దని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల సూచించారు. అంటే అవసరమైతే రూల్స్ దాటి అయినా పనిచేయాలని సూచించారు. రూల్స్ ను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రత్యర్థులకు ఆ అవకాశం లేకుండా చేయడానికి ఏం చేయాలో అన్నీ చేయాలని సజ్జల సూచించారు. ప్రతీ కౌంటింగ్ ఏజెంట్ ఏం చేయాలో వారి మెదళ్లలోకి ఎక్కించాలని ఛీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల తెలిపారు.
అలాగే పొరబాటున ఓ విషయంలో మనం వాదించినా పర్లేదు కానీ రూల్స్ కు కట్టుబడి ఉంటామనే వారు అయితే కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దని సజ్జల తేల్చిచెప్పేశారు. మన ప్రత్యర్థి ధర్మ యుద్ధం చేయడం లేదని, కాబట్టి వారి ఆటలు సాగకుండా ఏం చేయాలనే దానిపైనే వైసీపీ ఏజెంట్లు దృష్టిసారించాలన్నారు.












Click it and Unblock the Notifications