ఏపీలో ఎన్నికల శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల క్విక్ రెస్పాన్స్ కు సమర్థ్ యాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టడం కోసం సమర్థ్ ("SAMARTH"-Security Arrangement Mapping Analysis Response Tracking Hub) మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, సెక్టర్ ఆఫీసర్లు ఉపయోగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.
స్మార్ట్ మరియు క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్మార్ట్ మరియు క్విక్ పోలీసింగ్ కోసం ఈ మొబైల్ యాప్ ఎంత దోహదం చేస్తుందని, సమస్య ఆత్మక సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్లను ఎంతో సులభంగా గుర్తించి, వాటి ద్వారా మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలని తక్షణమే పంపించే అవకాశం ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

బాపట్ల జిల్లా ఎస్పీకి సిఈవో అభినందనలు
కంట్రోల్ రూమ్ నుండి పోలీస్ బలగాల లొకేషన్లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వంటి స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ మొబైల్ యాప్ ను అభివృద్ది పర్చి ప్రయోగాత్మకంగా బాపట్ల జిల్లాలో వినియోగిస్తున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ను ఆయన అభినందించారు.
సమర్థ్ మొబైల్ యాప్ ప్రయోజనాలను వివరించిన బాపట్ల ఎస్పీ
బాపట్ల జిల్లాలో ఉపయోగిస్తున్న ఈ సమర్థ్ మొబైల్ యాప్ వల్ల మంచి ఫలితాలను సాధిస్తున్నాం అని ఆయన తెలిపారు.ఈ యాప్ ద్వారా పోలీస్ అధికారులు డైరెక్ట్ గా కాల్ చేయవచ్చని, ఒక్క నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వున్న 2000 మంది పోలీసులకు ఒకేసారి ఆదేశాల జారీ చేయవచ్చని తెలిపారు. మొబైల్ కి ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా నోటిఫికేషన్ ద్వారా వారికి సమాచారం అందుతుందన్నారు.
సిబ్బంది రియల్ టైం లొకేషన్ ట్రాకింగ్
ఎన్నికలకు సంబంధించి వచ్చే పిటిషన్లను సంబంధిత పోలీస్ అధికారులకు యాప్ ద్వారా పంపి ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. మొత్తం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క వివరాలు, మొబైల్ నెంబర్స్ యాప్ నందు పొందుపరిచినట్టు , తద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క రియల్ టైమ్ లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయడం జరుగుతుందన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలకు పోలీసు బలగాలు తక్షణమే చేరుకునే వీలు
అంతేకాదు సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడానికి, యాప్ నుండి నేరుగా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయడానికి, సమస్యాత్మక ప్రాంతాలకు తక్షణమే పోలీస్ బలగాలు చేరుకోవడానికి, శక్తివంతమైన, బలమైన మరియు రియల్ టైం అప్లికేషన్ గా ఈ యాప్ పనిచేస్తున్నదని సి.ఇ.ఓ. ముకేష్ కుమార్ మీనాకు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications