సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్
విజయవాడ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. విజయవాడ స్టేషన్ యార్డులో ప్లాట్‌ఫాం నంబర్ 4 ఆప్రాన్ పనులను చేపట్టనున్నారు. దీనివల్ల కొన్ని రైళ్లను దారి మళ్లించనున్నారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అలాగే సికింద్రాబాద్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ ను కూడా మళ్లించారు. నాలుగో నంబర్ అప్రాన్ పనులు పూర్తయ్యేంత వరకు ఈ ఎక్స్ ప్రెస్.. విజయవాడకు వెళ్లదు.
ఈ తాజా మార్పులన్నీ కూడా ఏప్రిల్ 17వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. 45 రోజుల పాటు అంటే మే 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఇప్పుడు పాక్షిక రద్దు, తాత్కాలిక మళ్లింపులకు గురైన రైళ్లను పునరుద్ధరిస్తారు. యధాతథంగా విజయవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఏప్రిల్ 17 నుండి మే 31 తేదీల్లో బయలుదేరే నంబర్ 12740 సికింద్రాబాద్ - విశాఖపట్నం, నంబర్ 12739 విశాఖపట్నం - సికింద్రాబాద్ దారి మళ్లిస్తారు. సికింద్రాబాద్ బయలుదేరే నంబర్ 12740 ఎక్స్ ప్రెస్ రాయనపాడు - విజయవాడ బల్బ్ క్యాబిన్ - నార్త్ క్యాబిన్ - గుణదల మార్గంలో రైలు విశాఖపట్నానికి వెళ్తుంది.
విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 12739 ఎక్స్ ప్రెస్ గుణదల - విజయవాడ నార్త్ క్యాబిన్ - బల్బ్ క్యాబిన్ - రాయనపాడు మీదుగా సికింద్రాబాద్ కు వెళ్తుంది.
ప్లాట్‌ఫామ్ ఆప్రాన్ పనుల కారణంగా మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నంబర్ 67276 నర్సాపూర్ - విజయవాడ రైలు రామవరప్పాడు వరకే నడుస్తుంది. ఈ రైలు విజయవాడకు రాదు. నంబర్ 67256 మచిలీపట్నం - విజయవాడ రైలు కూడా రామవరప్పాడు వరకే నడుస్తుంది. నంబర్ 67269 విజయవాడ - మచిలీపట్నం,67270 మచిలీపట్నం - విజయవాడ, నంబర్ 67281 విజయవాడ - భీమవరం రైళ్లు రామవరప్పాడు వరకే అందుబాటులో ఉంటాయి.












Click it and Unblock the Notifications