వైజాగ్ , హైదరాబాద్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ ..!
దసరా పండుగ పూర్తయింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ప్రయాణికులంతా రేపటి నుంచి తిరిగి రొటీన్ లోకి అడుగుపెట్టబోతున్నారు. పండుగ కోసం ఏపీలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన వారంతా రేపటి నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది.
అలాగే ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్లిన వారు కూడా తిరిగి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరో రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
విశాఖ నుంచి చర్లపల్లికి, చర్లపల్లి నుంచి విశాఖకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 08589 నంబర్ ప్రత్యేక రైలు విశాఖ పట్నం నుంచి చర్లపల్లికి రేపు (శుక్రవారం) నడపనున్నారు. అలాగే 08590 నంబర్ ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి ఎల్లుండి (శనివారం) నడపనున్నారు. ఈ రెండు రైళ్లు ఎప్పుడు బయలుదేరుతాయో వివరాలు మాత్రం ప్రకటించలేదు.

అయితే ఈ ప్రత్యేక రైళ్లకు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగుడుగురాళ్ల, నడిగూడ స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. రెండు వైపులా నడిచే ప్రత్యేక రైళ్లు ఈ స్టాప్ లలో ఆగుతాయి. కాబట్టి ఆయా స్టాప్ లలో ప్రయాణికులు కూడా ఈ రైళ్లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

మరోవైపు చర్లపల్లి నుంచి ముజఫర్ పూర్ కు 07294 ప్రత్యేక అమృత్ భారత్ రైలును ఇవాళ నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైలు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, పండిట్‌లలో ఆగుతుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, అరా, దానాపూర్, పాట్లీపుత్ర మరియు హాజీపూర్ స్టేషన్లలో ఆగనుంది.












Click it and Unblock the Notifications