చంద్రబాబు తొలి వేటు శ్రీలక్ష్మిపైనే: ఆ ఐపీఎస్‌కూ నో అపాయింట్‌మెంట్
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక పరిపాలనపై దృష్టి సారించారు. వెలగపూడి సచివాలయంలో బాధ్యతలను స్వీకరించిన వెంటనే అయిదు సంతకాలు- మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సస్ ప్రతిపాదనలపై చేశారు.
ఆ వెంటనే ఆయన రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. ఏపీలో పని చేస్తోన్న అన్ని శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హితబోధ చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత అయిదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో కొందరు సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు అప్రజాస్వామ్యంగా వ్యవహరించారని అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాంటి వారందరూ తమ తీరును మార్చుకోవాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు.
అయిదేళ్లల్లో దారుణ పరిస్థితులను తాను కళ్లారా చూశానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిపాలనను మళ్లీ గాడిన పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనకు ఈ బాధ్యతను అప్పగించారని చెప్పుకొచ్చారు. ఈ అయిదేళ్లల్లో ప్రజలకు సుపరిపాలనను అందించాల్సిన బాధ్యతపై తమపై ఉందని గుర్తు చేశారు.
చంద్రబాబుతో తొలి భేటీ ఇదే కావడంతో ఈ భేటీలో పాల్గొన్న సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు.. ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. పుష్పగుచ్ఛాలను అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ముద్దాడ రవిచంద్ర, అజయ్ జైన్, సునీల్ కుమార్ వంటి అధికారులు ఆయనకు విషెస్ తెలిపారు.

ఈ భేటీలో.. సీనియర్ ఐఎఎస్ అధికారిణి, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి నుంచి బొకేను అందుకోవడానికి చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. అందరు అధికారులతో ఆమె కూడా చంద్రబాబు పుష్పగుచ్ఛాన్ని అందించడానికి వెళ్లగా దాన్ని తిరిగి ఇచ్చేశారాయన.
అదే సమయంలో ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులుకు అసలు అపాయింట్‌మెంటే దొరకలేదు. ఈ భేటీలో పాల్గొనడానికి ఆయనకు అనుమతి ఇవ్వలేదు చంద్రబాబు. సీఎం పేషీ వద్దకు వచ్చిన ఆయనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సిబ్బంది చెప్పడంతో సచివాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications