టీడీపీ మాజీ మంత్రిని వైసీపీలోకి ఆహ్వానించిన జగన్
Gollapalli Surya Rao: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది. సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి పంపించారు.
ఆ వెంటనే ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. రాజోలు టీడీపీ నాయకులు స్టాలిన్ బాబు సహా పలువురు అనుచరులు వైసీపీ కండువా కప్పుకొన్నారు.

ఆ సమయంలో సూర్యారావు వెంట.. వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీలో చేరిన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరి కొందరు నేతలు ఉన్నారు.
అనంతరం గొల్లపల్లి సూర్యారావు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ఎంతో పటిష్టపర్చానని, అవేవీ పట్టించుకోకుండా తనను మెడపట్టి పార్టీ నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత అవమానకర పరిస్థితుల్లో తాను టీడీపీని వీడాల్సి వచ్చిందని అన్నారు. తనను జగన్ పిలిచి అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు.
2019 నుంచి టీడీపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడిగా, రాజోలు నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా పని చేశానని, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీని నిలబెట్టానని చెప్పారు. దీనికోసం నిబద్ధత, క్రమశిక్షణతో పని చేశానని వ్యాఖ్యానించారు. తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా చూసుకున్నానని పేర్కొన్నారు.

అయినప్పటికీ- ఇటీవల విడుదల చేసిన 94 మంది అభ్యర్థల జాబితాలో తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం బాధ కలిగించిందని గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు. అవమానకరంగా తనను పార్టీ నుంచి గెంటేశారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు.. గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ.. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు.












Click it and Unblock the Notifications