మేనిఫెస్టో ప్రకటన తరువాత వైసీపీలో తొలి చేరిక: జగన్‌తో యనమల భేటీ- కండువా
YSRCP Manifesto 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు గుడ్‌బై చెప్పారు. రాజీనామాలు చేశారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజాబాబు, డీఎంఆర్ శేఖర్..వంటీ సీనియర్లు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఆ సమయంలో కృష్ణుడు వెంట వైఎస్ఆర్సీపీ కాకినాడ లోక్‌సభ, తుని అసెంబ్లీ అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, దాడిశెట్టి రాజా, ఇతర నాయకులు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆయన స్వయానా సోదరుడు. కాకినాడ జిల్లాలోని తుని సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈ ఎన్నికల్లో కూడా తుని టికెట్‌ను ఆశించారు యనమల కృష్ణుడు. ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. యనమల రామకృష్ణుడు కూతురు దివ్యను బరిలో దించారు. దీనితో తీవ్ర అసంతృప్తికి గురైన కృష్ణుడు పార్టీని వీడారు. వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. వైఎస్ జగన్.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన వెంటనే వైసీపీలో చేరిన తొలి నాయకుడు యనమల కృష్ణుడే.












Click it and Unblock the Notifications