ఏపీ ఆర్ధిక పరిస్ధితి నాట్ బ్యాడ్- హైకోర్ట్ కామెంట్స్- జగన్ సర్కార్ హ్యాపీ-విపక్షాలకు ఝలక్
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఇప్పటివరకూ దాదాపు లక్ష కోట్ల మేర సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లు చెప్పుకుంటోంది. కానీ విపక్షాలు మాత్రం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, దీనికి అధికార వైసీపీయే కారణమని ఆరోపిస్తున్నాయి. దీనికి ఇన్నాళ్లూ కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ పెద్దగా ప్రయత్నించలేదు. కానీ తాజాగా హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భఁగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సంతృప్తి వ్యకం చేసింది. విచిత్రంగా నిధుల్లేవంటూ హైకోర్టుకు చెప్పిన వైసీపీ సర్కార్.. అంతిమంగా న్యాయస్ధానం వ్యాఖ్యలతో సంతోషంగా ఉంది.

అప్పులాంధ్రప్రదేశ్
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటికే వారసత్వంగా వచ్చిన అప్పులతో పాటు చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి తలకిందులైంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ అఫ్పుల బాధ తప్పలేదు. దీంతో రాష్ట్రంలో ప్రజలపై అప్పుల భారం పెరిగిపోతోంది. గతంలో తమ ప్రభుత్వ హయాంలోనూ ఎడాపెడా అప్పులు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై విత్యం విమర్శలు గుప్పిస్తుున్నారు. దీంతో వీరికి వైసీపీ ప్రభుత్వం కౌంటర్లు ఇస్తూనే ఉంది. అయితే ఈ అప్పులతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి నానాటికీ దారుణంగా తయారవుతోంది. అయినా కోట్లాది రూపాయలు వెచ్చించి సంక్షేమ పథకాలకు లోటు రాకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

జగన్ సర్కార్ కు హైకోర్టు ప్రశంస
ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై నిత్యం విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కార్ కు అనూహ్యంగా హైకోర్టు నుంచి ఓ ప్రశంస లభించింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో వైసీపీ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా అధికారుల్ని స్వయంగా కోర్టుకు పిలిపించిన హైకోర్టు.. వారి నుంచి వివరణ కోరింది. దీంతో వారు గతేడాది రూ.60 వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. అదే నిజమైతే ప్రశంసనీయమని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ కితాబిచ్చారు.
ప్రభుత్వ ఆర్ధిక స్ధితి అంత బలహీనంగా ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

హైకోర్టు వ్యాఖ్యలతో సర్కార్ కు ఊరట
రాష్ట్ర ఆర్ధిక పరిస్ధిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సందర్బానుసారమే అయినప్పటికీ అంతిమంగా అవి జగన్ సర్కార్ కు ఊరటనిచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారంటూ నిత్యం విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి హైకోర్టు వ్యాఖ్యలతో తాత్కాలికంగా అయినా ఊరట లభించినట్లయింది. అదే సమయంలో విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఓ అవకాశం లభించింది. రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ శాతం సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేసుకునేందుకు వైసీపీకి ఓ అవకాశం కూడా లభించినట్లయింది.

ఆత్మరక్షణలో పడ్డ విపక్షాలు
నిన్న మొన్నటివరకూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడుతో పాటు పలువురు విపక్ష నేతలు విమర్శలు చేసేవారు. సంక్షేమానికి కూడా డబ్బుల్లేవని ఎద్దేవా చేసేవారు. కానీ తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై జగన్ సర్కార్ ను ఇకపై కౌంటర్ చేయాలంటే విపక్షాలు కొత్త అస్త్రాలు వెతుక్కోవాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగానే ఉందని, కానీ పాత బిల్లులు మాత్రం చెల్లించడం లేదని హైకోర్టు ఆక్షేపించింది. దీంతో విపక్షాలు ఇప్పుడు ఆర్ధిక పరిస్ధితిపై విమర్శలు మాని తమపై కక్షసాధింపును మాత్రం ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో వైసీపీ సంక్షేమానికి ఖర్చు చేస్తున్న మొత్తంపైనా విమర్శలకు వీల్లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications