కూటమి సర్కార్ కు తొలి షాక్-ఆ ఐఆర్ఎస్ సస్పెన్షన్ కు క్యాట్ బ్రేక్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గతంలో వైసీపీ ప్రభుత్వం నియమించిన లేదా అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ చక్రం తిప్పిన టాప్ బ్యూరోక్రాట్లను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఓ కేంద్ర డిప్యూటేషన్ వచ్చిన ఐఆర్ఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన క్యాట్ కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన్ను కూటమి సర్కార్ తాజాగా ఆర్ధిక అక్రమాల ఆరోపణలపై సస్పెండ్ చేసింది. దీంతో పాటు ఫైబర్ నెట్ వ్యవహారాలపై విచారణ చేపట్టింది. అయితే తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ మధుసూదన్ రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన తనను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.

దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ లోని క్యాట్ ధర్మాసనం.. మధుసూధన్ రెడ్డి సస్పెన్షన్ ను నిలిపేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తుంటే ఆయన్ను సస్పెండ్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. అలాగే మధుసూదన్ రెడ్డిపై అక్రమాలకు పాల్పడిన ఆధారాలుంటే, ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారని భావిస్తే ఆయన్ను ఫైబర్ నెట్ ఎండీ బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన రోజే సస్పెండ్ చేయాల్సిందని క్యాట్ తెలిపింది. ఆయన్ను సస్పెండ్ చేసిన జీవో నంబర్ 75 అమలు నిలిపేసింది. అంతే కాదు ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరుతూ క్యాట్ నోటీసులు కూడా జారీ చేసింది.












Click it and Unblock the Notifications