ఏపీ టీచర్ ఎమ్మెల్సీ పోరు-జగన్ సర్కార్ కు ఈసీ ఝలక్ !
ఏపీలో ఉపాధ్యాయుల ఆగ్రహం నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కార్ కు కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి అన్ని విధాలా అండగా నిలుస్తున్నట్లు విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎన్నికల పోరుతో పాటు రాయలసీమలో పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ తమ అభ్యర్ధుల్ని ఎట్టి పరిస్దితుల్లోనూ గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయుల్ని పెండింగ్ సమస్యలపై గొంతెత్తకుండా అణచివేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఈ సారి టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో వారి ఓట్లు కీలకంగా మారాయి. అదే సమయంలో టీచర్లను దారికి తెచ్చుకునేందుకు వైసీపీ సర్కార్ చేస్తున్న ఓ ప్రయత్నానికి ఈసీ బ్రేక్ వేసింది.
పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధితో పాటు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలిచేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కార్.. కడప ఆర్జేడీగా తన క్యాడర్ కంటే తక్కువ పోస్టులో బి. ప్రతాప్ రెడ్డిని పంపింది. గతంలో కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన కల్పలతారెడ్డి భర్తే ఈ ప్రతాప్ రెడ్డి. దీంతో పాటు ప్రతాప్ రెడ్డి వచ్చీ రాగానే టీచర్లతో సమావేశాలు నిర్వహించి వైసీపీ అభ్యర్ధులకే ఓటు వేయాలని కోరుతుండటం వివక్షాలకు కంటగింపుగా మారింది. దీంతో ప్రతాప్ రెడ్డి తీరుపై పీడీఎఫ్ అభ్యర్ధి విఠపు బాలసుబ్రమణ్యంతో పాటు టీడీపీ నేతలు సైతం సీఈవో ముకేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఈవో కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఏపీ టీచర్ ఎమ్మెల్సీ పోరులో విమర్శలకు కేంద్రబిందువుగా మారుతున్న కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని వెంటనే అక్కడి నుంచి తప్పించాలని వివక్షాలు సీఈవోను కోరాయి. అయితే సీఈవో మాత్రం ఆయన్ను జిల్లా కేంద్రం(వైఎస్సార్) కడప దాటి వెళ్లొద్దని మాత్రం ఆదేశాలు ఇచ్చారు. సెలవుపై కానీ, అధికారిక పర్యటనల పేరుతో కానీ జిల్లా కేంద్రం దాటకుండా చూడాలని అధికారులకు సీఈవో ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్ధితుల్లో జిల్లా కేంద్రం దాటాల్సి వస్తే సీఎస్ అనుమతి తీసుకోవాలని సీఈవో ఆయనకు సూచించారు. అలాగే ఆయనకు కూడా విమర్శలపై జవాబు ఇవ్వాలని మెమో జారీ చేశారు. దీంతో వైసీపీ అభ్యర్ధులకు మద్దతుగా ఆయన ఇతర జిల్లాల్లో పర్యటించే అవకాశం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications