ఎమ్మెల్యే కొలికపూడికి షాకివ్వబోతున్న టీడీపీ ? చంద్రబాబు అసాధారణ నిర్ణయం..!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారిపోయారు. ఎన్నికల సమయంలోనే కొలికపూడి దూకుడు వైఖరితో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ అప్పట్లో ఆయనకు సర్దిచెప్పింది. కానీ గెలిచాక కూడా ఆయన తీరు మారకపోవడం, రోజుకో వివాదంతో పార్టీకి తలనొప్పులు తెస్తుండటంతో కొలికపూడి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్దితి అధిష్టానానికి ఎదురవుతోంది. దీంతో కొలికపూడికి షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
తిరువూరులో సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం, రైతులు, జర్నలిస్టులు, ప్రత్యర్ధులలపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు కూడా ఆయన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. ఇదంతా చూస్తూ చంద్రబాబు ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాయి. దీంతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు దీక్షలు ,ర్యాలీల పేరుతో చీటికీ మాటికీ కొలికపూడి చేస్తున్న హంగామాను అడ్డుకోవడం అధిష్టానానికి కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా వివాదాల నేపథ్యంలో తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గా కొలికపూడి శ్రీనివాసరావు స్ధానంలో పార్టీలో సీనియర్ నేత శావల దేవదత్ ను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. రేపటి నుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానంటూ శావల దేవదత్ నిన్న చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా అన్ని వివరాలు తెలియ చేస్తానని శావల దేవదత్ చెప్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం శావల దేవదత్ కు ఏం సమాచారం ఇచ్చింది అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రోటో కాల్ పదవి ఇచ్చి నియోజకవర్గ భాద్యతలు చూడాలని దేవదత్ ను అధిష్టానం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎంపీ కార్యాలయం నుండి అధికార వర్గాలకు శావల దేవదత్ కేంద్రంగా ఆదేశాలు పాటించాలని సమాచారం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎమ్మెల్యే ఉండగా మరొకరికి అధికారిక బాధ్యతలు అప్పగించటం అనేది రాష్ట్రంలో ఓ సంచలనంగా చెప్పవచ్చు.ఉద్యమ నేపథ్యం గల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ పరిణామాలను చూస్తూ సైలెంట్ గా వుంటారా అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. కూటమి పార్టీల్లోని కొలికపూడి అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తిరుమల వెళ్లిన వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి.. శుక్రవారం తిరువూరుకు రానున్నారు.












Click it and Unblock the Notifications