రసవత్తరంగా పులివెందుల ఉపఎన్నిక..! వైసీపీకి ముందస్తు షాక్ లు..!
ఏపీలో గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో కూటమి అధికారంలోకి వచ్చింది. భారీ ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి పార్టీలు ప్రస్తుతం రాష్ట్రంలో పటిష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాజకీయంగా తిరిగి పట్టు సాధించేందుకు విపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పలు చోట్ల ఖాళీగా ఉన్న పలు స్థానిక సంస్థల సీట్లకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా ఉంది.
ఈ నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికను వైసీపీతో పాటు కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జగన్ అడ్డాలో జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్ రాజకీయానికి కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్న టీడీపీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలోకి దింపింది. అలాగే ఈ ఎన్నికల కోసం స్థానిక వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని తమవైపు తిప్పుకుంటోంది.

ఇదే క్రమంలో ఇవాళ పులివెందుల మండలంలోని కనంపల్లి, నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన దాదాపు 70 కుటుంబాలు ఇవాళ వైసీపీకి షాకిచ్చి టీడీపీలో చేరిపోయాయి. ఇందులో ఒక్క కనంపల్లి గ్రామం నుంచే 40 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరిని బీటెక్ రవి దగ్గరుండి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన సుమారు 25 కుటుంబాలకు జమ్మలమడుగు ఇన్ ఛార్జ్ భూపేష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
దీంతో టీడీపీ ఆధిక్యం పెరుగుతోంది.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వీరంతా టీడీపీ వైపు ఆకర్షితులైనట్లు పార్టీలో చేరిన నేతలు చెబుతున్నారు. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంను బీటెక్ రవి ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాన్ని అందరి సహకారంతో సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 12న జరిగే ఈ ఉపఎన్నికల లోపు మండలంపై పూర్తి పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications