చెవిరెడ్డికి హైకోర్టు షాక్- పోక్సో కేసులో దక్కని ఊరట ..!
ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై దాడి జరిగితే దాన్ని లైంగిక దాడిగా పేర్కొన్న వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ జరిపిన హైకోర్టు.. దీనిపై వెంటనే ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే పోలీసులు తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న చెవిరెడ్డి విజ్ఞప్తినీ పట్టించుకోలేదు.
చిత్తూరు జిల్లాలో బాలిక వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై నమోదైన కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనపై నమోదు చేసిన పోక్సో కేసును కొట్టేయాలని చెవిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు పోక్సో చట్టం కిందకు రావాలని ఆయన వాదిస్తున్నారు. దీనిపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

అనంతరం హైకోర్టు.. పోలీసుల్ని చెవిరెడ్డి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అరెస్టు కాకుండా రక్షణ ఇవ్వాలని చెవిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసేందుకు అవకాశం దొరికింది. హైకోర్టు ఆదేశాలపై చెవిరెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. దీని ఆధారంగా పోలీసులు కూడా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications