తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ-అతి భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. శుక్రవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ఇలాగే కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
అనంతరం వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రం నాటికి బలహీన పడి అల్పపీడనంగా మారవచ్చని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత అదే దిశలో కదులుతూ నవంబర్ 30న ఉత్తర తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నవంబర్ 29, 30 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 29న తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చిత్తూరు, కడప, సత్యసాయి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications