కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా కొనసాగిస్తున్నాయి. మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, జగన్ ను ఈసారి ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పావులు కదుపుతున్నారు.
వివేకా హత్యకేసుతో ఎన్నికల ప్రచారం
మరీ ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైయస్ షర్మిల, షర్మిలకు అండగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న దివంగత వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత జగన్ ను టార్గెట్ చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. కడప ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగిన షర్మిల కోసం ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న సునీత వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పదే పదే తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు.

ఎన్నికల అస్త్రంగా వివేకా హత్యకేసు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి, ఈ ఎన్నికలలో అవినాష్ రెడ్డి ని ఓడించాలని, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాను న్యాయపోరాటం చేస్తున్నానని చెప్పి సునీత తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. వైయస్ షర్మిలను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు వై.ఎస్ షర్మిల కూడా వివేకా హత్యకేసును పదే పదే ప్రస్తావిస్తున్నారు.
సునీత , షర్మిలకు షాకిచ్చిన కోర్టు
అయితే తాజాగా కడప కోర్టు 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఇప్పుడు ఎన్నికల్లో వాడుకోవడాన్ని తప్పు పట్టింది. సునీత, షర్మిల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోర్టు వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావించ కూడదని ఎన్నికల ముగిసే వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరు వివేకా హత్య పైన మాట్లాడకూడదని తేల్చి చెప్పింది.
హైకోర్టు కూడా అదే చెప్పే చాన్స్
అయితే తాము కడపలో న్యాయం కోసం ఎన్నికలలో ప్రచారం చేస్తుంటే కోర్ట్ అడ్డు చెప్పడం సరికాదని సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. అక్కడ కూడా వివేకా హత్య కేసును ఎన్నికల ప్రచారానికి వాడకూడదని హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు.
సునీత, షర్మిల ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?
దీంతో సునీత, షర్మిల వాట్ నెక్స్ట్ అని అందరూ ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసు ఉదంతం లేకపోతే, ఏ అంశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళతారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సునీత, షర్మిల ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications