ఏపీపై మోడీకి కక్ష, చంద్రబాబుపై కసి: ‘సన్నాసుల్లారా’ అంటూ హీరో శివాజీ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. తెలుగు కేంద్ర మంత్రులు కేంద్రంలో కార్పొరేట్ పైరవీల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేంద్రమంత్రులకు సన్మానం చేయాలంటూ ఆయన ఎద్దేవా చేశారు.
'ఎలా చూసేదేముందండి, ఇవాళ చూడాల్సింది చంద్రబాబు నాయుడు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది. 'అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు' అని చంద్రబాబునాయుడు మొన్న కూడా అన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల ఎలా వ్యవహరిస్తున్నదీ సాక్షాత్తూ ప్రభుత్వమే చెప్పింది' శివాజీ చెప్పారు.

'ఇవాళ, సన్నాసి మంత్రెవడో ఒకడు చెప్పాడని చెప్పి, ఆయనకు తెలియదేమో.. 14వ ఆర్థిక సంఘం.. బీజేపీ సన్నాసుల్లారా ఒకసారి వినండి.. 14వ ఆర్థిక సంఘం బీహార్‌కు లక్షా అరవై వేల కోట్లు ఇవ్వమందా సన్నాసుల్లారా? మీరు మనుషులేనా?' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధానిపై విమర్శలు
'మన ప్రధాని గురించి మాట్లాడుకోవడానికి మనకు సిగ్గుండాలి, ఆయన కేవలం ఆర్టీఫీషియల్ ప్రధానమంత్రి, ప్రాక్టికల్ ప్రధాన మంత్రి కాదు' అని హీరో శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రధాని నుంచి ఒక ప్రకటన వెలువడితే గానీ స్పష్టత రాదేమోనన్న ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.
'ఆంధ్రప్రదేశ్ అంటే మోడీకి కక్ష, ముఖ్యంగా చంద్రబాబు నాయుడంటే మోడీకి కసి. పిచ్చి వ్యూహాలు, రాజకీయకుయుక్తులు పన్నుతున్న మోడీకి తెలియదేమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడ్వాన్స్ డ్ పీపుల్ అని. ఇటువంటివన్నీ ఇక్కడి ప్రజలు నమ్మరు' అని అన్నారు.
ఎవరైతే బీజేపీ వైపు వెళతారో వారికి ఉన్న విలువ కూడా పోతుందన్నారు. ఏపీ ప్రజలకు మోడీపై నమ్మకమే లేదని తెలిపారు. బీజేపీతో ఉంటే టీడీపీకి డిపాజిట్లు కూడా రావని, బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చి, కేంద్రంపై ఎదురుదాడి చెయ్యాలన్నారు. ఏపీకి ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతోందని శివాజీ అన్నారు.












Click it and Unblock the Notifications