పవన్ కళ్యాణ్ కు షాక్: తుపాకీతో బెదిరించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఒకపక్క జనసేన గుర్తు గాజు గ్లాస్ ను ఎన్నికల సంఘం రద్దుచేసి దానిని ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి పోతిన మహేష్ వంటి కీలక నాయకులు గుడ్ బై చెప్పి వైసిపి బాట పడుతున్నారు.
పవన్ తో పాటు వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ఇక ఇదే సమయంలో తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ జనసేనపై ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

గాజు గ్లాసు గుర్తుకు అడ్డుగా బక్కెట్ గుర్తు
జనసేన గాజు గ్లాసు గుర్తును పోలి ఉన్న తమకు ఎన్నికల సంఘం కేటాయించిన బకెట్ గుర్తుపై పోటీ చేయొద్దని తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆరోపించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన నేతలపై ఫిర్యాదు చేశామని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి నివేదించామని ఆయన తెలిపారు.
5 కోట్లు ఆఫర్.. ఆపై తుపాకీ గురిపెట్టి బెదిరింపు
జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి తనకు తుపాకీ గురిపెట్టి మరీ బెదిరించారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దని హెచ్చరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, కానీ తాము ఆ ఆఫర్ కు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని పేర్కొన్నారు.
జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పై సంచలన ఆరోపణలు
జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పై సంచలన ఆరోపణలు చేయడంతో పాటు, తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని వారి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ జనసేన పార్టీ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ బెదిరింపు ఆరోపణలపై ఇప్పుడు జనసేన పార్టీ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications