వైసీపీనేత భూమనకు షాక్... గోశాల గోవుల మృతి ఆరోపణలపై టీటీడీ చర్యలు!
వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని, టిటిడి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మూడు నెలల్లో వంద గోవులు మృతి చెందాయని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో టిటిడి బోర్డు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ తరహా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూమనపై ఎస్పీకి ఫిర్యాదు
తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాల పై టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. భూమన పై ధర్మకర్తల మండలి ఫిర్యాదు మేరకు ఆయన పైన చర్యలు తీసుకోవాలని వారు లిఖితపూర్వకంగా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

భూమనపై కేసు పెట్టండి
ఎస్వి గోశాలలో 100 గోవులు మృతి చెందాయని పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి పైన ఐటి యాక్ట్ 74 , బి ఎన్ ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన భూమన
తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని ఆయన తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, ఇక ఆ విషయాన్ని తాము ఆధారాలతో సహా బయట పెట్టామని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో గోవులకు పురుగులు పట్టిన ఆహారాన్ని పెట్టారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
భూమన హయాంలో టీటీడీలో అక్రమాల విచారణ జరుగుతుంది
గతంలో భూమన హయాంలో టీటీడీ లో జరిగిన అక్రమాల పైన విచారణ సాగుతుందని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు అన్నింటిని వెలికి తీస్తున్నామని టిటిడి బోర్డు త్వరలోనే అన్నిటి పైన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే కాదు టీటీడీలో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి అవినీతిని బయటకు తీస్తామని తేల్చి చెప్పారు.
టీటీడీపైన అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే కాదు తాను కూడా లోకల్ నాయకుడినని చెప్పిన భాను ప్రకాష్ రెడ్డి తన దగ్గర టిటిడి గురించి ఆయన కంటే ఎక్కువ సమాచారమే ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసినా, మాట్లాడిన ఏ స్థాయి వ్యక్తి పైన అయినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దిశగా టిటిడి బోర్డు లో నిర్ణయం తీసుకుంటామని భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications