వేలల్లో బస్సు టికెట్ల ధరలు-ఏపీలో సంక్రాంతి ప్రయాణికులకు షాక్..!
ఏపీలో సంక్రాంతి పండుగ జరుపుకుందామని సొంతూళ్లకు బయలుదేరుతున్న వారికి భారీ షాకులు తప్పడం లేదు. ఓవైపు ఆర్టీసీ పండుగ సందర్బంగా దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల పేరుతో రెగ్యులర్ సర్వీసుల్ని దారి మళ్లించేసింది. అదే సమయంలో దీన్ని సొమ్ము చేసుకుంటూ రంగంలోకి దిగిన ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వందల్లో ఉండే టికెట్ రేట్లను వేలల్లోకి మార్చేసి ప్రయాణికులకు సంక్రాంతికి ముందే షాకులిస్తున్నాయి.
రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా సాధారణంగా బస్సుల్లో రద్దీ ఉంటుంది. అదే సమయంలో ఆర్టీసీ దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల పేరుతో రెగ్యులర్ సర్వీసుల్ని వాడుకుంటోంది. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి ఇలా ఎక్కడ చూసినా ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ కనిపిస్తోంది. అధికారులకు ఎప్పటిలాగే మామూళ్లు ఇచ్చేసి భారీ ఎత్తున టికెట్ రేట్లు పెంచేసి తీసుకుంటే తీసుకోండి, లేకపోతే పోండి అన్నట్లుగా ప్రయాణికులకు తేల్చిచెప్పేస్తున్నాయి.

విజయవాడ నుంచి విశాఖకు తీసుకుంటే సాధారణ రోజుల్లో అత్యధికంగా స్లీపర్ టికెట్ రేటు వెయ్యి నుంచి 1200 ఉంటుంది. కానీ ఇప్పుడు అది కాస్తా గరిష్టంగా 2 వేల నుంచి 4 వేల వరకూ పలుకుతోంది. అంతే కాదు ఈ రేట్లను ఏకంగా ఆన్ లైన్ లో పెట్టి ఆర్టీసీకి బహిరంగ సవాల్ విసురుతున్నాయి.
అలాగే విజయవాడ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలకు టికెట్ రేట్లూ ప్రైవేటు ట్రావెల్స్ అమాంతం పెంచేశాయి. దీంతో పండుగ సమయంలో సొంతూరికి వెళ్లాలన్న ప్రయాణికుల ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నాయి. అయినా ఈ రెండు, మూడు రోజులు వీటిని నియంత్రించే పరిస్ధితి లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు.












Click it and Unblock the Notifications