ఆ పెన్షన్లు తీసేయమని నేనే సీఎంకు చెప్పా- స్పీకర్ అయ్యన్న షాకింగ్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు పొందుతున్న పలు వర్గాలకు షాకిచ్చింది. ఓవైపు ఎన్నికల హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు.. అనర్హుల విషయంలో మాత్రం షాకులిచ్చారు. అనర్హుల ఏరివేతకు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి మరీ తొలగించారు. అయితే ఈ వ్యవహారంలో తాను సీఎం చంద్రబాబుకు ఇచ్చిన ఓ సలహా అమలు కావడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇవాళ సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు. ఈ అంశంపై రెండు నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తాను లేఖ రాసినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. నిబంధనల ప్రకారం 40 శాతం పైగా వైకల్యం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉంటుందని, 40 శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తిస్తారని ఇందులో స్పష్టంచేశారు.

అలాగే అర్హత లేకపోయినా ఇప్పటివరకు వికలాంగుల పింఛను పొందిన వారితో పాటు వారికి సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. రద్దైన పింఛన్లపై ప్రభుత్వం నెలకు రూ. 2.94 కోట్లు, ఏటా రూ. 35.28 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే మొత్తం 4,148 మంది వికలాంగులలో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారిని గుర్తించారని, అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపికచేసినట్టు స్పీకర్ తెలిపారు.

అలాగే 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా, 3,349 మంది అనర్హులైన వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్టు వెల్లడించారు. వీరిలో అర్హత ఉన్న అనర్హులుగా ఉన్నవారు తాజాగా వైద్యుల ధృవపత్రం తీసుకుని తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అటు నర్సీపట్నం నియోజకవర్గంలో 742 మందిని అనర్హులుగా గుర్తించగా, వారిలో 8 మందికి ఆరోగ్య పింఛన్లు, 114 మందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరుచేసి, 670 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేశామని తెలిపారు. వీరందరికీ నెలకు రూ. 40.20 లక్షలు, ఏటా రూ. 4.82 కోట్లు, ఐదేళ్లకు రూ. 124 కోట్లు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని స్పీకర్ తెలిపారు. అర్హత ఉన్నా అనర్హులుగా గుర్తించిన వారు ఈ నెల 25వ తేదీ లోపు వైద్యుల ధృవపత్రాలు సమర్పించాలన్నారు.












Click it and Unblock the Notifications