జగన్‌పై దాడి: సిట్ ఏర్పాటు, విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్, సీఐఎస్ఎఫ్, పోలీసుల భిన్న స్పందన
హైదరాబాద్/విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) అధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఏసీపీ నాగేశ్వరరావుతో పాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉండనున్నారు.

సిట్ ఏర్పాటు.. దాడి ప్రచారం కోసమే..
ఈ సందర్భంగా ఏడీసీపీ మహేంద్రపాత్రుడు మాట్లాడుతూ.. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై గురువారం మధ్యాహ్నం 12.34 గంటలకు దాడి జరిగిందని తెలిపారు. నిందితుడు జానపల్లి శ్రీనివాస్ వైసీపీ అభిమాని అని వెల్లడించారు. ప్రచారం కోసమే దాడి చేసినట్టుగా తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు డీజీపీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు..
కాగా, వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. జగన్‌పై దాడికి పాల్పడట్టు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ జి ప్రకాశ్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరమే వైయస్ జగన్ హైదరాబాద్ బయలుదేరినట్టు తెలిపారు.

సాధారణ స్థితికి వచ్చింది..
‘వైయస్ జగన్ మధ్యాహ్నం 1.05 గంటలకు ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అందుకోసం జగన్ వీఐపీ లాంజ్‌లో వేచి చూస్తుండగా.. 12.40 గంటల ప్రాంతంలో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్ కత్తితో ఆయనపై దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయం కావడంతో పాటు, రక్తస్రావం జరిగింది. దీంతో ఆయనకు వెంటనే ఎయిర్‌పోర్ట్ డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స అందించటం జరిగింది. ఆ తర్వాత ఆయన తను వెళ్లాల్సిన ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లారు. ఆయనపై దాడి చేసిన నిందితుడిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసు శాఖ ఈ విషయంపై విచారణ చేపట్టింది. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి సాధారణ నెలకొంది' అని ఆ ప్రకటనలో డైరెక్టర్ వివరించారు.
పోలీసులు, సీఐఎస్ఎఫ్.. బాధ్యత ఎవరిది?
కోడి పందేలకు వాడే పదునైన కత్తితో జగన్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే పోలీసులు, కేంద్ర పరిశ్రమల రక్షణ దళం(సీఐఎస్‌ఎఫ్) ఉన్నతాధికారుల సమాధానం చర్చనీయాంశంగా మారింది. రక్షణ బాధ్యత తమది కాదంటే తమది కాదని చెబుతుండటం గమనార్హం.

భద్రత తమది కాదంటూ డీజీపీ
విమానాశ్రయంలో భద్రత పర్యవేక్షణ అంతా సీఐఎస్‌ఎఫ్ పరిధిలో ఉంటుందని, తమకు సంబంధం లేదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్వయంగా మీడియా సమావేశంలో చెప్పడం గమనార్హం. ఎయిర్‌పోర్టు లోపల తమకు పని లేదని, అక్కడ ఏం జరిగినా సీఐఎస్‌ఎఫ్ చూసుకుంటుందని అన్నారు. విమానాశ్రయంలోని కత్తిని ఎలా తీసుకెళ్లారనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు. సీఐఎస్‌ఎఫ్ రిపోర్ట్ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
తనిఖీలు తమ పరిధిలోకి రావన్న సీఐఎస్ఎఫ్
సీఐఎస్‌ఎఫ్ డీజీ సీవీ ఆనంద్ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తమ వైఫల్యం ఏమాత్రం కాదని చెప్పుకొచ్చారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని చెప్పారు. తమ సిబ్బంది ప్రయాణికుల గుర్తింపు కార్డులు, టిక్కెట్లు మాత్రమే పరిశీలిస్తారని స్పష్టం చేశారు. లగేజీ చెక్ చేయరని అన్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రత తమ పరిధిలోకి రాదని, చెక్ ఇన్ ఏరియాకు ఎవరైనా వెళ్లొచ్చని వివరించారు. ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి ఏఈపీ పాస్ ఉంటుందని, వీరిని చెక్ చేయమని వెల్లడించారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని, దీనిపై ఏవివేయన్ సెక్యురిటీ సెమినార్‌లోనూ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆనంద్ వివరించారు.
జగన్‌ను గతంలో ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్న పోలీసులు.. ఇప్పుడెందుకిలా?
కాగా, రాష్ట్ర పోలీసుల తీరు సరిగా లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైయస్ జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం తమ పరిధిలోనికి రాదని చెబుతున్న డీజీపీ.. గతంలో ప్రత్యేక హోదా ర్యాలీ కోసం విశాఖపట్నం వచ్చినప్పుడు వైయస్ జగన్‌ను ఎయిర్‌పోర్టు రన్‌వేపైనే పోలీసులు అడ్డుకున్న విషయం గుర్తు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయమా అని నిలదీస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా డీజీపీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిందితుడ్ని, అతని వెనకాల ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications