శివాలయాల్లో దర్శనం, ప్రదక్షిణ ఇలా చేస్తేనే సానుకూల ఫలితాలు..!!
కార్తీక సోమవారం వేళ శివాలయాలు భక్తులతో రద్దీగా ఉన్నాయి. శివనామస్మరణతో మారు మోగుతున్నాయి. కార్తీక సోమవారం వేళ శివాలయాలకు వచ్చిన భక్తులు ప్రదక్షిణలు చేయటం సర్ సాధారణం. అయితే, ఈ ప్రదక్షిణాలకు కూడా ఓ లెక్కుంది. శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే భక్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ప్రదక్షిణల వేళ
దేవాలయాలకు వెళ్లిన వారు ప్రదక్షిణలు చేయటం సాధారణం. అన్ని ఆలయాల్లోనూ భక్తులు దేవుడి గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూంటారు. ఒక్కో ఆలయంలో ఈ ప్రదక్షిణలకు ఒక్కో విధమైన ప్రత్యేకతలు ఉన్నాయి. భక్తులు తమ విశ్వాసం మేరకు తమ సమస్యలు పరిష్కారం కోసం.. మనోభీష్టాలు నెరవేరటానికి ఎంతో నమ్మకంతో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణల గురించి పండితులు అనేక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసే వేళ కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తేనే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. లేకుంటే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఎలా చేయాలి
ప్రదక్షిణలు చేసే విధి విధానాల గురించి లింగ పురాణంలో ప్రస్తావించారని పండితులు గుర్తు చేస్తున్నారు. ఈ పురాణం మేరకు శివాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి, ధ్వజస్థంభం నుంచి చండీశ్వరుని వరకూ ప్రదక్షిణ చేయాలి. అదే విధంగా అక్కడ చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుంచి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. ఆ తరువాత అభిషేక జలం బయటకు వెళ్లే సోమ సూత్రం వరకు వెళ్లి, తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుందని వివరిస్తున్నారు.
ఆలయంలో ఇలా
అదే విధంగా అక్కడ నుంచే వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. ఈ విధంగా చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణం, సోమసూత్ర ప్రదక్షిణ గా పేర్కొంటారని వివరిస్తున్నారు. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే సాధారణంగా చేసే పది వేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో వివరించారు. ఇలా మూడు ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణ సమయంలో సోమసూత్రం దాటరాదని, శివునికి అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుంచే పోతుందని గుర్తు చేస్తున్నారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు నందికి శివునికి మధ్యలో నడవకూడదు. ఎందుకంటే విగ్రహం నుంచి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. ఆ తరంగాల శక్తిని సిద్ధపురుషులు తప్ప సామాన్య మానవులు భరించలేరు. అందుకే దేవాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు ఒక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications