హిందూ వ్యతిరేక విధానాలు.. హిందువుల పండుగ పైనే ఆంక్షలెందుకు... జగన్ సర్కార్‌పై సోము వీర్రాజు ఫైర్...
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి పండుగపై వివాదం రాజుకుంటోంది. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రజలంతా ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి పండుగను ఇళ్లల్లో జరుపుకోవడానికి ప్రభుత్వ అనుమతి కావాలా? అని తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.ప్రతి ఆదివారం వందల మందితో నిండుకునే చర్చిలకు లేని ఆంక్షలు,రంజాన్,బక్రీద్,మొహరం పండుగలకు లేని ఆంక్షలు,పాఠశాలలు,సినిమా హాళ్ళు తెరవడానికి,వేల మందితో బహిరంగ సభలు నిర్వహించటానికి లేని ఆంక్షలు ఒక్క హిందువులు ఘనంగా నిర్వహించుకునే వినాయకచవితి పండుగకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు.ఇతర మతాల పండుగలకు ఈ ఆంక్షలు వర్తించవా అని నిలదీవారు.
వెంకన్న స్వామికి హుండీలో డబ్బులు పడతాయి కాబట్టి అక్కడ అనుమతులు ఇచ్చారా... వినాయకుడికి కొబ్బరికాయలు తప్ప ఇంకేమీ రావని ఆంక్షలు పెడుతున్నారా... అంటూ ప్రభుత్వాన్ని సోము వీర్రాజు ప్రశ్నించారు. వినాయక విగ్రహలు బయట ఏర్పాటు చేస్తే అరెస్ట్ చేస్తామని డీజీపీ ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని,డీజీపీ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి నిరవధిక నిరసనకు దిగుతానని హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకునేలా ప్రభుత్వం అనుమతినివ్వాలన్నారు.వైసీపీ ప్రభుత్వం ఒక వర్గానికే పరిమితమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హిందూ వ్యతిరేక విధానాల కొనసాగింపుగానే చూస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అభివృద్దిని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ, హిందువులు, వినాయకచవితి వేడుకలను నిర్వహించుకుంటే మీకేంటి అభ్యంతరం ముఖ్యమంత్రి గారూ?@ysjagan pic.twitter.com/1ECLIzVTNO
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 4, 2021
ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. హిందూ పండుగల మీద ఏకపక్షంగా కఠిన ఆంక్షలు విధించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.రంజాన్, బక్రీద్, మొహర్రం, క్రిస్మస్ వంటి పండుగలు ఎలా నిర్వహించాలో వారి మత పెద్దలతో చర్చించే మీరు.. 90 శాతం హిందువులు ఉండే సమాజంలో... వారి పండుగల నిర్వహణ విషయంలో మఠాధిపతులు, స్వామీజీలతో ఎందుకు చర్చించరని నిలదీశారు. ఆ బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించారు.

Recommended Video
కరోనా దృష్ట్యా వినాయక విగ్రహాలు బయట పెట్టడానికి వీల్లేదని... నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని స్పష్టం చేసింది.ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వ తీరును నిరససిస్తున్నారు. ప్రభుత్వం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతోందని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications