బెట్టువీడేనా: పట్టువిడుపులతో బాబు, కేసీఆర్ ముందుకు
హైదరాబాద్: రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశం సుహృద్భావ వాతావరణంలో గంటన్నరకు పైగా సాగింది. చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర రావులు పలు అంశాల పైన చర్చలు జరిపారు. పట్టువిడుపులతో ముందుకెళ్దామని ఇరువురు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగుల విభజన పైన సమస్యలు ఎప్పుడు తలెత్తినా ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో సమస్యలు తలెత్తినప్పుడు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై వారు చర్చించారు. ఉద్యోగుల విభజన, 9, 10 షెడ్యూళ్ల అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అలాగే రెండు రాష్ట్రాల సీఎస్‌లు సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. కాగా, చంద్రబాబు, కేసీఆర్ గవర్నర్ సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం 12.10 నుండి 12.40 వరకు సమావేశమయ్యారు. వీరిద్దరితో గవర్నర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం రెండు రాష్ట్రాల స్పీకర్లు, కార్యదర్శులు, చైర్మన్లు, ఇతర అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. కాగా, చంద్రబాబు, కేసీఆర్‌ల భేటీ నేతృత్వంలో అందరి దృష్టి వీరి పైనే ఉంది.












Click it and Unblock the Notifications