రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్స్ కు ఇది తప్పనిసరి..! తాజా ఆదేశాలు..!
రైల్వే టికెట్ బుకింగ్స్ విషయంలో అంతకంతకూ పెరిగిపోతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ కౌంటర్లలో బుక్ చేసే టికెట్ల విషయంలో అన్ని ప్రాంతీయ రైల్వేలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కూడా ఇవాళ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇకపై స్టేషన్లలో ఉండే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ కు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాల్సిందే.
రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లలో రిజర్వ్ చేసిన టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు మొబైల్ నంబర్‌లను అందించడం తప్పనిసరి అని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ప్రయాణికులకు తెలిపింది. ప్రయాణీకులతో కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడానికి, వారి ప్రయాణ సమయంలో సకాలంలో అప్ డేట్స్, సహాయం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

రిజర్వేషన్ ప్రయాణికులు ఇలా తమ మొబైల్ నంబర్లను ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. ఇందులో చార్ట్ తయారీ తర్వాత వెయిట్ లిస్ట్ చేయబడిన టిక్కెట్ల స్టేటస్ పై మెసేజ్ లు అందుకునేందుకు, రైలు రాకపోకలు, ఆలస్యం, మళ్లింపులు లేదా రద్దులపై ముఖ్యమైన సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.అలాగే పట్టాలు తప్పడం లేదా ఇతర అంతరాయాలు వంటి అత్యవసర పరిస్థితులలో ఫిర్యాదుల త్వరిత పరిష్కారం , సమర్థవంతమైన కమ్యూనికేషన్, టికెట్ల డబ్బులు వాపసు, రద్దులపై సకాలంలో అప్ డేట్స్ అందించేందుకు మొబైల్ నంబర్ పనికొస్తుంది.

కాబట్టి పీఆర్ఎస్ కౌంటర్లలో టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు రిజర్వేషన్ అభ్యర్థన స్లిప్‌లో ప్రయాణికులు తమ మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనాలని అధికారులు కోరారు. ప్రయాణీకుడు లేదా వారి ప్రతినిధి అందించిన మొబైల్ నంబర్‌ను పీఆర్ఎస్ వ్యవస్థలో ఫీడ్ చేసుకుంటారు. తద్వారా భవిష్యత్తులో ఇది అన్ని విధాలా ప్రయాణికులకు, రైల్వేకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications