9 మంది రెబల్ ఎమ్మెల్యేల పై అనర్హత - స్పీకర్ కీలక నిర్ణయం..!!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు అంశం కీలకంగా మారుతోంది. రాజ్యసభ ఎన్నికల వేళ వైసీపీ, టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు, టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన నలుగురు, జనసేన ఒక్క ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. ఈ నెల 29న స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ తో వైసీపీ అలర్ట్ అయింది. వచ్చే నెలలో ఏపీ నుంచి మాడు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ మూడు సీట్లను అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా వైసీపీకి దక్కనున్నాయి. అదే జరిగితే రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం జీరో కానుంది. దీంతో టీడీపీ వైసీపీ నుంచి ముగ్గురు గెలవకుండా ముందస్తు వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వేళ సీట్లు రాని వారిని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనిని గ్రహించిన వైసీపీ నాయకత్వం టీడీపీలో చేరిన నలుగురు రెబల్స్ పైన అనర్హత వేటు కోసం స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేల పైన చర్యలు కోరుతూ టీడీపీ మరో ఫిర్యాదు చేసింది.

ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా కొంత కాలం క్రితం చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఈ లోగానే రెబల్ ఎమ్మెల్యే ల పైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. దీంతో, అనర్హత పిటీషన్ల పైన ఇప్పటికే రెండు మూడు పార్టీలకు చెందిన తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసారు. టీడీపీలో చేరిన వైసీపీ రెబల్స్ 30 రోజుల సమయం కావాలని స్పీకర్ ను కోరారు. కాగా, తాజాగా స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని తొమ్మది మంది ఎమ్మెల్యేలకు లేఖలు పంపారు. దీంతో, 29న ఎమ్మెల్యేలు హాజరవుతారా. హాజరు కాకుంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications