హోదా కోసం ఎంపీల రాజీనామాపై డెడ్‌లైన్: ఏప్రిల్ 6లోగా సెటిల్మెంట్‌పై జగన్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అబద్దపు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు.
చదవండి: చంద్రబాబు ఎదురుదాడి, మెట్టు దిగిన మోడీ- అమిత్ షా, రంగంలోకి రామ్‌మాధవ్
అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని డెడ్ లైన్ విధించడం వెనుక ఎలాంటి ఇతర ఆలోచన లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రానికి సమయం ఇస్తున్నట్లుగా ఆయన చెప్పారు.

హోదాకు బదులు ప్యాకేజీ
ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తానని చెప్పిందని, కానీ అది తమకు సమ్మతం కాదని జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాము ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నామని చెప్పారు. విభజన సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారన్నారు.

ఏప్రిల్ 6.. సెటిల్ చేసుకునే అంశాలు ఉన్నాయా అంటే
ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని ప్రకటించారని, సెటిల్ చేసుకునే అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇందుకు ఆ సమయం సరిపోతుందా అని ప్రశ్నిస్తే, జగన్ స్పందిస్తూ.. ప్రస్తుతం క్లైమాక్స్‌లో ఉందని చెప్పారు. హోదాపై కేంద్రం తమ హామీని నిలబెట్టుకోకుంటే తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు.

ఏప్రిల్ 6 గడువు వెనుక ఈ కారణం తప్ప ఏదీ లేదు
అయితే తమ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కలిసి మొత్తం ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఫలితం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. తమ డెడ్ లైన్ (ఏప్రిల్ 6) వెనుక ప్రత్యేక హోదా తప్ప, మరే ఇతర కారణమూ లేదని తేల్చి చెప్పారు.

అమరావతి నిర్మాణంపై
అమరావతి నిర్మాణంపై అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం చెబుతూ.. ఇతరులు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా శాశ్వత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కొన్ని అయినా పూర్తి చేసేవారని జగన్ అభిప్రాయపడ్డారు. కర్నాటక అసెంబ్లీ భవనం 1952లో ప్రారంభమై 1956లో ముగిసిందని గుర్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం గత నాలుగేళ్లుగా డిజైన్లు అంటూనే కాలయాపన చేశారన్నారు.

పెట్టుబడులపై విమర్శలు
రెండుసార్లు ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లు జరిగాయని రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెప్పారని, కానీ ఆయన చెప్పినట్లు ఏపీలో పెట్టుబడులు ఎక్కడకు వచ్చాయని జగన్ ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తన తండ్రి, ఇప్పుడు తాను చంద్రబాబుతో పోరాడుతున్నామని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications