సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్- తిరుపతి ప్రత్యేక రైళ్లు -15, 16 తేదీల్లో ..!
దీపావళి పండుగ ముగిసినా ప్రధాన నగరాల మధ్య ఇంకా రైళ్లలో ప్రయాణికుల రద్దీ మాత్రం కొనసాగుతోంది. దీంతో దక్షిణ కోస్తా రైల్వే దీపావళి తర్వాత రద్దీని తట్టుకునేందుకు ఇవాళ మరో నాలుగు ప్రత్యేక రైళ్లు (Special Trains) ప్రకటించింది. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య రెండు రైళ్లు, అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గంలో మరో రెండు రైళ్లు ప్రకటించింది. ఈ నాలుగు రైళ్లూ ఈ నెల 15, 16 తేదీల్లో రాకపోలు సాగించబోతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు.
ముందుగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు నంబర్ 08517 ఈనెల 15వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్దానం చేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ నెల 16న సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.05కు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకూ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమడోలు టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లిలో స్టాప్ లు ఇచ్చారు. వీటిలో మొత్తం 19 కోచ్ లు ఉంటాయి. 2 సెకండ్ ఏసీ కోచ్ లు, 4 ధర్డ్ ఏసీ కోచ్ లు, 7 స్లీపర్ కోచ్ లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.

అలాగే తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో మరో రెండు రైళ్లు నడుపుతున్నారు. ఇందులో తిరుపతి నుంచి రైలు నంబర్ 07421 నవంబర్ 15 ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ఈ నెల 16న సాయంత్రం 4.15కు సికింద్రాబాద్ లో బయలుదేరే మరో ప్రత్యేక రైలు నంబర్ 07422 మరుసటి రోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకూ రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూరు, కృష్ణ, యాద్గిర్, సెరాం, తాండూరు, వికారాబాద్, హైటెక్ సిటీ, బేగంపేటలో స్టాప్ లు ఇచ్చారు. వీటిలో 2 సెకండ్ ఏసీ, 6 ధర్డ్ ఏసీ, 8 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.














Click it and Unblock the Notifications
