ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆస్పత్రుల డెడ్ లైన్ ..! సేవలు నిలిపేస్తామని హెచ్చరిక..!
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ ను ఆర్ధిక ఇబ్బందుుల చుట్టుముడుతున్నాయి. దీంతో పలు బిల్లుల కింద చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలోని స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. తమ బిల్లుల్ని క్లియర్ చేయకపోతే రోగులకు ఆగస్టు 15 కల్లా సేవలు నిలిపేస్తామని తెలిపింది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు లేఖ రాసింది.
ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు రాసిన లేఖలో ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం.. ఇప్పటికే ప్రభుత్వం తమకు రూ.2500 కోట్ల బకాయి పడిందని, నెలకు రూ.250 కోట్ల చొప్పున ఇది పేరుకు పోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. దీన్ని వెంటనే క్లియర్ చేయాలని కోరింది. ఎనిమిది నెలలుగా తమకు బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వానికి గుర్తుచేసింది. కాబట్టి తక్షణం బకాయిల మొత్తం విడుదల చేయాలని కోరుతోంది.

వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టి అధికారులు తమను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ఆగ్రహంగా ఉంది.. ఇదే పరిస్ధితి కొనసాగితే ఆగస్టు 15 నాటికి సేవల్ని నిలిపేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. బిల్లులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం రూపాయి కూడా రావడం లేదని తెలిపింది. కాబట్టి ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించాలని కోరుతోంది. దీంతో ఆగస్టు 15 కల్లా ప్రభుత్వం వీరి బిల్లు బకాయిలు క్లియర్ చేస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications