జగన్ ఆగ్రహం: నిజమే కానీ.. మాట మార్చిన ఎస్పీవై!
కర్నూలు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే సమైక్య హీరో అని వ్యాఖ్యానించిన కర్నూలు నంద్యాల పార్లమెంటు సభ్యులు ఎస్పీవై రెడ్డి మాట మార్చారట! మంచి పని ఎవరు చేసినా అభినందించాల్సిందేనని, కిరణ్ సమైక్య సింహంలా వ్యవహరించారని, ఈ విషయాన్ని మనం అంగీకరించాలని, ముఖ్యమంత్రి బాగా చేశారని, బిల్లును రిజెక్ట్ చేసి పంపించారని, గత సోమవారం ముఖ్యమంత్రిని తాను కలిశానని, నీళ్ల కోసం మాట్లాడడానికి వెళ్లానని ఎస్పీవై రెడ్డి ముఖ్యమంత్రి పైన శుక్రవారం ప్రశంసలు కురిపించారు.
అయితే, నంద్యాలలో ఆయన శనివారం మరోలా మాట్లాడారు. సమైక్యాంధ్ర చాంపియన్ జగన్ ఒక్కడేనని, ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే శక్తి ఒక్క ఆయనకే ఉందని, సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా సిఎం వ్యవహరించారని జగన్‌ను పొగుడుతూ వ్యాఖ్యానించారు.

జగన్ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసి ఉంటే రాజకీయ సంక్షోభంతో తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేది కాదని ఎస్పీవై రెడ్డి అన్నారు.
ఆయన నంద్యాలలో మాట్లాడుతూ.. గత సోమవారం సిఎం కార్యాలయానికి వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే సిఎంను కలవలేదని, కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి ఒకే ఒక నిమిషం మాట్లాడి బయటకు వచ్చానని చెప్పారు. అయితే తనపై కొందరు రాజకీయ కుట్ర చేసి మీడియాలో, పత్రికల్లో వచ్చే విధంగా చేశారని ఆరోపించారు. కాగా, ఎస్పీవై రెడ్డికి వైయస్ జగన్ క్లాస్ పీకినట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications