తిరుమలలో అరుదైన ఘట్టం- భక్తులకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 61,315 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,076 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
కాగా తిరుమలలో ఫిబ్రవరి 1న అరుదైన, విశేష పర్వదినం జరుగనుంది. ఆదివారం నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. ఈ ఉత్సవాలకు హాజరయ్యే అశేష భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ తీర్థానికి ఆదివారం తెల్లవారు జామున 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు.

ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు.
దీనికోసం టీటీడీ ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 12 ఏళ్ల వయస్సులోపు ఉన్న పిల్లలు, అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. పాపవినాశనం వద్ద భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతిస్తారు. భక్తుల అత్యవసర వైద్యం అందించడానికి ఈ మార్గంలో టీటీడీ రెండు అంబులెన్సులు, నాలుగు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాపవినాశనం మార్గంలో ఆ రోజున ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను అనుమతించరు. గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 40 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనుంది. ఈ తీర్థానికి వెళ్లే యాత్రికులకు మంచినీరు, మజ్జిగ, పాలు, కాఫీ, పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం పంపిణీకి చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications