అదే నా భవిష్యత్ కార్యాచరణ.. జనసేన మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన..
జనసేన పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు ఆక్తికర విషయాలు వెల్లడించారు.జనసేన పార్టీతో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. రాజీనామా ఆమోదం పొందిన విషయం అందరికీ తెలిసిందేనని.. రాజీనామాకు దారితీసిన కారణాలను అందులో స్పష్టంగానే పేర్కొన్నానని చెప్పారు. ఈ సందర్భంగా జేడీ తన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించారు.

జేడీ భవిష్యత్ కార్యాచరణ
ఇక ముందు కూడా తాను ప్రజా సేవ చేస్తానని చెప్పిన జేడీ.. సోమవారం ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. ప్రజాసేవకు అత్యుత్తమ వేదిక రాజకీయమేనని అభిప్రాయపడ్డారు.
Recommended Video

బడ్జెట్‌పై ప్రశంసలు
తాజా కేంద్ర బడ్జెట్‌ను జేడీ ప్రశంసించారు. కేంద్ర బడ్జెట్‌లో రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు. యువతరాన్నివ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని అన్నారు. వ్యవసాయం, మేకిన్ ఇండియా, విద్య తదితర రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు బాగున్నాయని అన్నారు. దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలను అభినందించారు.

ఆ విషయం ఇంకా డిసైడ్ చేయలేదు..
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలు కృషి చేయాలని జేడీ అన్నారు. నిధులు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్రంలోని 25 మంది ఎంపీలపై ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదన్నారు. ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనుకుంటే ముందుగా మీడియాకే చెబుతానన్నారు.

సీఏఏని సమర్థించిన జేడీ
ఇక పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని జేడీ లక్ష్మీనారాయణ మరోసారి సమర్థించారు. ఇండియా ధర్మశాల కాదని, దేశ భద్రత చాలా ముఖ్యమని అన్నారు.ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ముఖ్య ఉద్దేశం అన్నారు. అసోంలో శరణార్థుల కోసమే ఎన్‌ఆర్‌సీ తీసుకొచ్చారని, ఎన్ఆర్‌సీతో ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు. ఇక ఎన్‌పీఆర్ సర్వే సాధారణంగా పదేళ్లకోసారి జరుగుతుందని,పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications