Vande bharat : వందేభారత్ రైళ్లపై రాళ్లేయకండి ప్లీజ్.. జనానికి దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి..
తెలుగు రాష్ట్రాల పరిధిలో నడుస్తున్న వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇవాళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. భారతీయ రైల్వేల తరపున దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఏ ప్రకటన విడుదల చేశారు. జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలాగే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరించాలని ప్రజలకు సంబంధించిన ఆస్తులను రక్షించాలని దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలను అభ్యర్థించింది.
దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో భారతీయ రైల్వేలు ఒకటని, దేశ ప్రజలకు 160 సంవత్సరాల నుండి రవాణా రంగంతో పాటు వివిధ రకాలైన సేవలు చేయడమే కాకుండా దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దేశంలోని వివిధ ప్రదేశాలను రైలు మార్గాలతో కలుపుతూ మిలియన్ల మంది ప్రయాణీకులకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందిస్తుందని వెల్లడించింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సమయంలో దేశమంతా లాక్‌డౌన్ బరిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కుడా భారతీయ రైల్వే సేవాదృక్పథంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా రైలు సేవలను 24 గంటలూ నడిపిందని తెలిపింది.

వివిధ సరుకుల సరఫరా సమతుల్యం చేయడానికి గాను అవసరమైన వస్తువుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర వస్తువులను రవాణా చేస్తున్నట్లు రైల్వే తెలిపింది. అయితే ఇటీవల కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు విచ్చలవిడిగా వందే భారత్ రైళ్ల పై రాళ్లదాడి వంటి ఘటనలకు పాల్పడడంతో రైళ్ల కు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ రకమైన సంఘ వ్యతిరేక చర్యల మూలాన సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రైళ్లు, రైల్వే స్టేషన్‌లు, ప్రజల ఆస్తుల నష్టం జరిగినట్టేనని గుర్తుచేసింది. ఇవన్నీ ప్రజల డబ్బుతో నిర్మించి ప్రజల కొరకు సేవలు అందిస్తున్నాయని వెల్లడించింది. ఈ దాడుల మూలాన కల్గిన నష్టాన్ని తిరిగి ప్రజలే భరించవలసి ఉంటుందని తెలిపింది. కాబట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తులకు నష్టం కలిగించవద్దని రైల్వే శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందని తెలిపింది.
కాబట్టి రైళ్ల పై రాళ్లు విసరటం వంటి దుశ్చర్య లకు పాల్పడటం ద్వారా రైల్వే ఆస్తులకు నష్టం కలిగించవద్దని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. రైలు ప్రయాణీకులకు సురక్షితమైన, ఇబ్బందులు లేని రైలు ప్రయాణాన్ని అందించేందుకు సాధారణ ప్రజలతో పాటు రైలు వినియోగదారుల సహకారం వుండాలని దక్షిణ మధ్య రైల్వే ఈ సందర్బంగా ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేయడంతో పాటు అభ్యర్థిస్తోందని ఈ ప్రకటన తెలిపింది.












Click it and Unblock the Notifications