చదువులో దాటలేక పగ పెంచుకున్నాడు: తోటి విద్యార్థిని చంపేశాడు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పగ పెంచుకుని తోటి విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. సహ విద్యార్థితో చదువులో పోటీ పడి అతన్ని అధిగమించలేకపోయాడు. దాంతో తోటి విద్యార్థిపై పగ పెంచుకున్నాడు. అదును చూసి అతన్ని చంపేశాడు.
ఐదు నెలల క్రితం విశాఖపట్నం జిల్లాలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడిని పోలీసులు తుదకు ఛేదించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఓ విద్యార్థిని విచారించగా, దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురానికి చెందిన తాళపుశెట్టి కోదండరాముడు పదో తరగతి విద్యార్థి. రాముడు ఆటపాటల్లో ముందుండటం అదే గ్రామానికి చెందిన సహ విద్యార్థికి కంటగింపు అయింది.

అతని తండ్రి గ్రామంలో నాయకుడు కావడంతో, తానూ పాఠశాలలో చలాయించుకోవాలని ప్రయత్నించేవాడు. ఇందుకు తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొంటూ, అందరితో శభాష్ అనిపించుకొంటున్న కోదండరాముడు అడ్డుగా ఉన్నాడని భావించాడు. ఈ క్రమంలో కోదండరాముడిని వెంట తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి హతమార్చాడు.
గ్రామంలో మృతదేహం పడిన ప్రాంతం రాళ్లు,రప్పలు, పొదలతో ఉండటం వల్ల పాము కరిచిందని భావించారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో కోదండరాముని శరీరంపై బలమైన గాయాలున్నట్టు తేలింది. ఈ క్రమంలో మృతుడి తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు సహ విద్యార్థిని ప్రశ్నించారు. అతడు నేరాన్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు మైనర్ కావడంతో అతని వివరాలను పోలీసులు దాచి పెట్టారు.












Click it and Unblock the Notifications