చిత్తుగా తాగారు: కూతురితో వెళ్తున్న మహిళా ప్రొఫెసర్ ఆటో ఆపి చెత్త చేశారు
గుంటూరు: చిత్తుగా తాగిన ఇద్దరు విద్యార్థులు ఓ మహిళ ప్రొఫెసర్ పట్ల చెత్తగా ప్రవర్తించిన తీరు వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పేరేచర్లకు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి, గుంటూరు సమీపంలోని మరో కళాశాలకు చెందిన విద్యార్థి కలసి బుధవారం మద్యం మత్తులో వీరంగం సృష్టించారు.
కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు విద్యార్థులను మేడికొండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. కళాశాలలో సీనియర్ మహిళా ప్రొఫెసర్, తన కూతురుతో కలసి ఆటోలో ఎక్కారు. కళాశాల నుంచి కొద్ది దూరం రాగానే ఆటోను అడ్డగించిన విద్యార్థులు తాము కూడా ఆటో ఎక్కుతామన్నారు. వెనుక మరో ఆటో వస్తోందని చెప్పినా వినకుండా దాంట్లోనే ఎక్కుతామంటూ భీష్మించుకున్నారు.

దాంతో భయపడిన మహిళా ప్రొఫెసర్ కళాశాలకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న కళాశాల సిబ్బంది విద్యార్థుల ఆగడాలను అడ్డుకోవాలని ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. బలవంతంగా విద్యార్థులను పక్కకు తప్పించి ఆటోను పంపించారు.
దాంతో ఓ విద్యార్థికి కోపం వచ్చింది. అతను రోడ్డుకు అడ్డంగా పడుకొని ట్రాఫిక్‌ను స్ధంభింపజేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల యాజమాన్యం మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. విద్యార్ధులిద్దరూ ద్విచక్ర వాహనంపై వచ్చినా దానిని వదలి ఆటోకు అడ్డం తగిలారని, మద్యం మత్తులో ఉండడంతో వారు వీరంగం సృష్టించారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications