మహిళ పగ: మాజీ వ్యాపార భాగస్వామి భార్య హత్య
హైదరాబాద్: మూసీనదిలో ముక్కల రూపంలో లభించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మాజీ వ్యాపార భాగస్వామి భార్యను పగబట్టి ఓ మహిళ హత్య చేయించినట్లు తేలింది. ఈ హత్యకు ఆమెకు పోలీసు కాంట్రాక్ట్ ఉద్యోగి సహకారం అందించాడు. పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేకంగా చొరవ చూపడంతో కేసు చిక్కు ముడి వీడింది. బుధవారంనాడు అత్తాపూర్‌లోని ఫిల్లర్ నెంబర్ 113 వద్ద మూసీనదిలో ముక్కల రూపంలో సునీత అనే మహిళ మృతదేహం లభ్యమైంది.
హైదరాబాదులోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి అదే ప్రాంతంలో నివసించే ఓ మహిళతో కలిసి కొన్నేళ్ల క్రితం సనత్‌నగర్ ప్రాంతంలో ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించాడు. ఇందులో కృష్ణ భార్య సునీత (44)తో పాటు మరికొంత మంది డైరెక్టర్లుగా ఉన్నారు.
అయితే, ఫార్మూస్యూటికల్ కంపెనీ వ్యవహారాలు సాఫీగా సాగలేదు. వివాదాలపై కృష్ణ కంపెనీ లా బోర్డులోనూ మరికొన్ని చోట్లా వ్యాజ్యాలు వేశాడు. దీంతో భాగస్వామిగా ఉన్న మహిళ కృష్ణపై కక్ష కట్టింది. మాజీ హోం మంత్రితో తనకు బంధుత్వం ఉందని కూడా మహిళ కృష్ణను బెదిరించింది. దీంతో ఈ ఏడాది మార్చి 10వ తేదీన కంపెనీ నుంచి తప్పుకున్నాడు. లావాదేవీలను సెటిల్ చేసుకున్నాడు.

అయినా అతనిపై ఆ మహిళకు కోపం తగ్గలేదు. తనకు పరిచితుడైన జగన్నాథనాయుడిని రంగంలోకి దింపింది. అతను వివిధ పోలీసు స్టేషన్లలో పార్ట్‌టైమ్ రైటర్‌గా పనిచేస్తుంటాడు. అతని సహకారంతో కృష్ణ మాజీ వ్యాపార భాగస్వామి అయిన మహిళ మార్చి 14వ తేదీన కొంత మంది పోలీసులను రంగంలోకి దింపింది.
మూసాపేటలో జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానితుడిగా కృష్ణను సనత్‌నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. ఆ సమయంలో జగన్నాథనాయుడు అక్కడే ఉన్నాడు. మహిళతో ఎందుకు మనస్పర్థలు పెంచుకున్నావంటూ జగన్నాథనాయుడు కృష్ణను అడిగాడు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని బెదిరించాడు. ఫలితం లేకపోవడంతో పోలీసులు కృష్ణను వదిలేశారు.
కృష్ణ ఇబ్బందులు ఎదురవుతాయని విషయాలను ఎక్కడా చెప్పలేదు. బీహార్‌లోని పాట్నాలో ఉద్యోగం రావడంతో కుటుంబాన్ని ఇక్కడే ఉంచి కృష్ణ వెళ్లిపోయాడు. దాంతో జగన్నాథనాయుడు, మహిళ కృష్ణ భార్యను లక్ష్యం చేసుకున్నారు.
ఈ ఏడాది మార్చి 10వ తేదీన సైబరాబాద్ పోలీసులు ఓ వ్యభిచారం గృహంపై దాడి చేసి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని, అతని సెల్‌ను సనత్‌నగర్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. రైటర్‌గా పనిచేస్తున్న జగన్నాథనాయుడు ఆ సెల్‌ఫోన్‌లోని సిమ్‌ను తీసుకున్నాడు. ఆ సిమ్‌ను వాడుతూ సనీతతో జగన్నాథనాయుడు మాట్లాడుతూ వచ్చాడు.
ఈ నెల 16వ తేదీన మాయమాటలు చెప్పి సునీతను బయటకు రప్పించి కిడ్నాప్ చేశారు. తాను దూరంగా వెళ్లిపోతున్నానంటూ ఆమె సెల్‌ఫోన్ నుంచి కృష్ణకు సెల్‌కు మెసేజ్ పెట్టారు. ఓ సెల్‌ఫోన్‌ను అంబర్‌పేటలో పడేశారు.
ఎస్ఎమ్మెస్ చూసి కంగారు పడిన కృష్ణ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్నప్పటికీ దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, కృష్ణ పట్టు వదలకుండా సనత్‌నగర్ పోలీసు స్టేషన్ నుంచి మిస్సైన సిమ్ నుంచి తన భార్యకు కాల్స్ వచ్చినట్లు కనిపెట్టాడు. ఆ విషయం చెప్పినా అంబర్‌పేట పోలీసులు పట్టించుకోలేదు.
దాంతో కృష్ణ శుక్రవారంనాడు పోలీసు కమిషనర్ సివి ఆనంద్‌ను కలిసి విషయం చెప్పాడు. దాంతో కేసును వివిధ కోణాల్లో దర్యాప్త చేయించడానికి సివి ఆనంద్ చర్యలు తీసుకున్నారు. జగన్నాథనాయుడిని బుధవారంనాడు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. చివరకు జగన్నాథనాయుడిని తీసుకుని వచ్చి సునీత మృతదేహం కోసం గాలించారు. తల, కొన్ని శరీర భాగాలు తప్ప మొండెం లభించింది.












Click it and Unblock the Notifications