రఘురామ బెయిల్ బాండ్స్ గల్లంతు-సుప్రీంలో ఊరట-మళ్లీ ఇచ్చేందుకు 4 వారాల గడువు
ఏపీ ప్రభుత్వం గతంలో నమోదు చేసిన రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందిన వైసీపీ రెబెల్ ఎఁపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ ఊరట లభించింది. గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు సూచించిన విధంగా సీఐడీ కోర్టులో బెయిల్ బాండ్లు సమర్పించినా అవి కాస్తా గల్లంతయ్యాయి. దీంతో రఘురామరాజు బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో ఆయన మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గతంలో సీఐడీ కోర్టులో సమర్పించిన బెయిల్ బాండ్లు గల్లంతు కావడంతో తిరిగి వాటిని సమర్పించేందుకు రఘురామరాజు సుప్రీంకోర్టు అనుమతి కోరాల్సిన పరిస్దితి వచ్చింది. సీఐడీ కోర్టు సూచన మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజుకు ఇవాళ అక్కడ ఊరట లభించింది. గల్లంతైన బాండ్లను తిరిగి సీఐడీ కోర్టుకు సమర్పించేందుకు ఆయనకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రఘురామరాజు త్వరలో వాటిని సీఐడీ కోర్టులో సమర్పించబోతున్నారు.

ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన రాజద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజు.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి సీఐడీ కోర్టులో బెయిల్ పొందినా సొంత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరి పూచీకత్తు పత్రాలు సమర్పించాల్సి వచ్చింది. అయితే వీటిని సమర్పించకుండానే రఘురామరాజు ఢిల్లీ పారిపోయారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన సీఐడీ కోర్టు నుంచి క్లారిటీ తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వీటిని తిరిగి సమర్పించేందుకు ఇప్పుడు నాలుగు వారాల గడువు ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగే అవకాశముంది.
మరోవైపు రఘురామరాజుకు వ్యతిరేకంగా ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో రఘురామరాజుతో పాటు ఆయనకు సహకరించిన రెండు తెలుగు ఛానళ్లను సైతం నిందితులుగా చేర్చారు. అంతే కాకుండా రఘురామరాజు నుంచి వీరికి భారీ మొత్తాలు బదిలీ అయినట్లు కూడా సీఐడీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో విచారణ కోసం రఘురామరాజును కూడా త్వరలో పిలిపించే అవకాశముంది. ఇప్పటికే రఘురామరాజుకు ఈ కేసు విచారణలో సహకరించాలని సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తున్న సందర్భఁగా షరతు విధించింది.












Click it and Unblock the Notifications