ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై పారని వైసీపీ పాచిక.. ఆళ్ళకు సుప్రీం వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుపై కోర్టులలో అనేక పిటిషన్లు దాఖలు చేసి ఇరుకుని పెట్టాలని చూసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటుకు నోటు కేసులో వైసిపి నేత రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది.
ఆళ్ళకు సుప్రీం ధర్మాసనం హెచ్చరిక
ఓటుకు నోటు కేసులో సిబీఐ విచారణ కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్లు పూర్తిగా రాజకీయ కక్షతోనే వేసినట్టు ధర్మాసనం భావించింది. రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని, కోర్టులను వేదికగా చేసుకోవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది.

ఆళ్ళను మందలించిన సుప్రీం చెప్పిందిదే
రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ళ రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఇక ఇదే సమయంలో పిటిషనర్ కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యం పైన ఆరా తీసిన ధర్మాసనం పిటిషనర్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీవ్రంగా మందలించింది.
ఓటుకు నోటు కేసు సీబీఐ కి ఇవ్వాలని ఆళ్ళ పిటీషన్
దాదాపు పది సంవత్సరాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని ఈ కేసు పైన సిబీఐ విచారణ జరిపితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి డబ్బులిచ్చి ఓటు కొనుగోలు చేసిన వ్యవహారం ఏమిటనేది బయటకు వస్తుందని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
పారని ఆళ్ళ పాచిక
ఈ కేసులో చంద్రబాబును నిందితుడుగా చేర్చాలని మరో పిటిషన్ వేశారు. అయితే ఈ రెండు పిటిషన్లను నేడు సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. చంద్రబాబు పైన వైసిపి నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పాచిక పారలేదు. పైపెచ్చు ఆయనని కోర్టు మందలించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలినట్టు అయింది.












Click it and Unblock the Notifications