జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐకి సుప్రీం కీలక ఆదేశాలు..!
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సీబీఐకి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ మేరకు సీబీఐకు పలు ప్రశ్నలు వేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో అసాధారణ జాప్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఇందుకు గల కారణాలు చెప్పాలని ఇవాళ సీబీఐని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సీబీఐ న్యాయవాదులు.. ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో నిందితులు దాఖలు చేస్తున్న వరుస డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే తమ దర్యాప్తు ఆలస్యమవుతోందన్నారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో రాతపూర్వకంగా చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications