సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీం షాక్- మీ పోస్టులు మాకు అర్ధం కావా ?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతల్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిన ఆ పార్టీ సోషల్ మీడియా బాస్ సజ్జల భార్గవ్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆయనపై పలు కేసులు నమోదు చేసి అరెస్టుకు సిద్ధమవుతున్న వేళ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సజ్జల భార్గవ్ రెడ్డికి అక్కడా ఊరట దక్కలేదు. దీంతో పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు సజ్జల భార్గవ్ కు షాకిచ్చాయి.
రాజకీయ ప్రత్యర్దులపై పెట్టిన సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో తాను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులోని జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సజ్జల భార్గవ్ పెట్టిన పోస్టులపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తమకు అర్ధం కావనుకున్నారా అంటూ కీలక ప్రశ్న వేసింది. అలాగే ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు పెట్టారో తమకు తెలియదా అంటూ నిలదీసింది.

సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్, అతని టీమ్ పెట్టిన పోస్టులు భరించరాని స్దాయికి వెళ్లాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, వ్యవస్థ ఇలాంటి వాటిని అస్సలు క్షమించదని తెలిపింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దని సుప్రీంకోర్టు నిందితులకు తెలిపింది. అలా బెయిల్ ఇస్తే మాత్రం ప్రతీ ఒక్కరూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని కూడా వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదని తెలిపింది. అయితే రెండు వారాల పాటు అరెస్టు కాకుండా ఊరటనిచ్చింది. ఆలోపు బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.












Click it and Unblock the Notifications