ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు-సుప్రీం కీలక నిర్ణయం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీ నిర్వహించేందుకు వీలుగా కూటమి సర్కార్ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు టెట్ పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. అయితే షెడ్యూల్ ప్రకారం త్వరలో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో డీఎస్సీతో పాటు టెట్ పరీక్షలు కూడా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులోని జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు ఆరుగురు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. వీరు లేవనెత్తిన కారణాలు సమంజసంగా లేవని అభిప్రాయపడింది. దీంతో వీరి పిటిషన్లను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే ఇతరత్రా సమస్యలు ఏవైనా ఉంటే మాత్రం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతానికి వీరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ రాష్ట్రంలో డీఎస్సీ, టెట్ పరీక్షలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం వచ్చే నెల 6 నుంచి జూలై 6 వరకూ ఈ పరీక్షలు నిర్వహించి టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్దమవుతోంది. మొత్తం 16347 పోస్టులకు ఈసారి డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications