తిరుపతి లడ్డూ కేసులో సుప్రీం కీలక నిర్ణయం..!!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు పైన దాఖలైన పిటీషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు నిర్ణయం వెల్లడించింది. ఈ కేసు విచారణ ఏపి కాకుండా రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ ఏపీలోనే కొనసాగుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తిరుమల లడ్డూ కేసులో దాఖలైన పిటీషన్ పైన భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన డెయిరీ పరిశ్రమ వ్యాపారవేత్త, మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మచీంద్ర శాంతారాం లంకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆయన నిందితుల్లో ఒకరు. ఏపీలో కేసు విచారణకు అనుకూల వాతావరణం లేదని కోర్టుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వరుసగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

పిటీషన్ తిరస్కరణ
ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేసును పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కోరారు. సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారా? అని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ ప్రశ్నించారు. 'మా ఆదేశాలతో వారందరినీ మౌనంగా ఉండేలా చేశాం. ఏదైనా జరిగితే మీరు మా వద్దకు రావచ్చు' అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కేసు బదిలీకి తగిన కారణాలు కనిపించడం లేదని చెబుతూ.. ప్రస్తుత దశలో విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేస్తోందని.. రాష్ట్రంలోని అధికార వర్గాలు లేదా రాజకీయ నాయకులు చేసే ఎలాంటి వ్యాఖ్యలు, ప్రకటనల వల్ల సీబీఐ విచారణ ప్రభావితం కాదని జస్టిస్ బాగ్చీ స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
