బీజేపీకి మిత్రుల షాకులు- యూపీలో పోటీకి బీహారీలు- వ్యతిరేకిస్తున్న యూపీ ఫ్రెండ్..!
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీకి (BJP) యూపీతో పాటు బీహార్ లోని మిత్రులు షాకులిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలకమైన నితీష్ కుమార్ జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్ శక్తి పార్టీలు.. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ పార్టీల్ని విస్తరించుకునే పనిలో ఉన్నాయి. అయితే యూపీలో బీజేపీ మిత్రపక్షం, ఓం ప్రకాష్ రాజ్ భర్ కు చెందిన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) దీన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడకుండా చూసుకోవడం బీజేపీకి సవాలుగా మారుతోంది.
బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక జేడీయూ, ఎల్జేపీ కీలకంగా ఉన్నాయి. స్ధానిక రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఈ రెండు పార్టీల్ని చేరదీసి, పలుమార్లు ఎన్నికల్లో లబ్ది పొందిన బీజేపీ.. ఇప్పుడు అవే పార్టీలు యూపీలో ఎంట్రీ ఇస్తామంటే మాత్రం అవుననలేక, కాదనేక సతమతం అవుతోంది. అదే సమయంలో యూపీలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎన్డీయే పార్టీ సుహేల్ దేవ్ పార్టీ వీరిద్దరి ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీని వెనుక మరో కీలక కారణం కూడా ఉంది.

గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ఉన్న బీజేపీ, జేడీయూ, లోక్ జన్ శక్తి.. ఇదే సుహేల్ దేవ్ పార్టీని కూటమిలో చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు యూపీలో మాత్రం జేడీయూ, లోక్ జన్ శక్తి పార్టీలు ఎన్డీయే కూటమిలో చేరి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో వీరిద్దరి ఎంట్రీని వ్యతిరేకిస్తున్న ఓం ప్రకాష్ రాజ్ భర్ పార్టీ.. ఇదే అదనుగా తమకు మరిన్ని సీట్లు ఇవ్వాలని బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే కూటమిలో ఉన్న యూపీ మిత్రపక్ష పార్టీలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఇచ్చే క్లారిటీని బట్టి సుహేల్ దేవ్ పార్టీ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అయితే జేడీయూ సంగతి ఎలా ఉన్న చిరాగ్ పాశ్వాన్ దళిత పార్టీ లోక్ జన్ శక్తిని యూపీలో తమతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ అనుమతించే అవకాశముంది. దీని వెనుక మధ్య యూపీతో పాటు పూర్వాంచల్ ప్రాంతాల్లో ఉన్న పాశ్వాన్ ల జనాభాయే కారణం.














Click it and Unblock the Notifications
