పులివెందులలో పెట్రోల్ బాంబులతో దాడి.. పరిషత్ పోలింగ్‌లో ఎక్కడెక్కడ తీవ్ర ఉద్రిక్తత ఉందంటే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పెట్రోల్ బాంబులు వేయడంతో మంటలు చెలరేగి పరిస్థితి తీవ్రంగా మారింది.
పోలింగ్ కేంద్రం వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేరుకుని, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పెట్రోల్ బాంబులు వేయడంతో భారీ మంటలు చెలరేగాయి. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం సమీపంలో పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. దీంతో అక్కడ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారగా భారీగా పోలీసులు మోహరించారు.
కడప జిల్లా నందలూరులోనూ ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకోగా, స్థానికులు వారి వాహనాలను అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సొంత గ్రామంలో ఆ పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది.విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ, జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరుపార్టీల నేతలు పరస్పరం నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో జనసేన నాయకురాలిపై వైఎస్సార్‌సీపీ నేత దాడికి పాల్పడినట్లు సమాచారం.
పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.పరిషత్ ఎన్నికల్లో పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ ముగిసే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ఉద్రిక్తతలకు పాల్పడకూడదని అధికారులు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
