ఒంటి పూట బడులు.. ఐటీ వర్క్ ఫ్రం హోం - ఎల్‌నినో, నీటి కొరత తో..!!
ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంది. నీటి కొరత పెరుగుతోంది. దీంతో.. సాగుకే కాదు తాగునీటికి సమస్యలు ఏర్పుడుతున్నాయి. విద్యా సంస్థలతో పాటుగా ఐటీ కంపెనీల నిర్వహణ పైనా తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో.. ప్రత్యామ్నాయ విధానాల పైన కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే కార్పోరేట్ విద్యా సంస్థలు హాస్టళ్ల నిర్వహణ సమస్యగా మారుతోంది. దీంతో.. ప్రభుత్వం ఒంటి పూట బడుల నిర్వహణతో పాటుగా ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా నిర్ణయం వెల్లడించనుంది.
ఎల్‌నినో ప్రభావం, నీటి కొరత ఊహించని నిర్ణయాలకు కారణంగా మారుతోంది. తీవ్రమైన నీటి కొరతతో ఇప్పటికే హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని అనేక కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు 'నీళ్ల' సెలవులు ప్రకటించాయి. పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. ఈ సెలవుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించాయి. నీటి సమస్య డిసెంబరులో మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఒంటిపూట బడులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఐటీ ఉద్యోగులకూ ఇంటి నుంచే పని విధానాన్ని అమలు చేసేలా సంస్థలకు సూచన చేసేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వేసవి తరహాలో ఎక్కడ చూసినా నీటి ట్యాంకర్లే కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ మార్గాల పై కసరత్తు
కాగా, డిసెంబరులో నీటి కొరత మరింత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలూ అధికంగా నమోదు అవుతాయని చెబుతున్నారు. దీంతో, వేడి ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఒంటి పూట బడులు పెట్టాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. జూనియర్ కాలేజీల వేళలూ మార్చాలని భావిస్తు న్నట్టు సమాచారం. డిగ్రీ, ఇతర ఉన్నతస్థాయి కోర్సుల విద్యార్థులకు కోవిడ్ నాటి తరహాలో.. ఆన్‌లైన్ బోధన అమలు చేయాలన్న అంశాన్నీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో నీటి కొరత నెలకొంది. చాలా కంపెనీలు ఇప్పటికే ట్యాంకర్ల నీటిపై ఆధారపడుతున్నాయి. దీంతో, ప్రస్తుత పరిస్థితుల్లో'వర్క్ ఫ్రం హోం' ఇవ్వాలని.. దానితో నీరు, విద్యుత్ ఆదా అవుతుందనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు కుటుంబాలతో తమ సొంత ప్రాంతాలకు వెళ్తే.. సుమారు 20 లక్షల మంది నగరాన్ని వీడే అవకాశాలు ఉన్నాయని అంచనా. దీంతో, సంక్రాంతి నుంచి వర్క్ ఫ్రం హోం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
