ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం.. వాతావరణ శాఖ తాజా అలెర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో మారు వర్ష సూచన చేసింది. ఒకపక్క తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్న వేళ, ఏపీలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు దక్షిణ కోస్తాలోనూ, రాయలసీమలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏపీ వెదర్ రిపోర్ట్
అమరావతి వాతావరణ కేంద్రం ఈ మేరకు వర్ష సూచన చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వెదర్ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇక అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి చేసిన వెదర్ రిపోర్ట్ ప్రకారం నేడు, రేపు, ఎల్లుండి పూర్తిగా ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుంది. అక్కడ ఎటువంటి వర్ష సూచన లేదని పేర్కొంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్ష సూచన
ఇక దక్షిణ కోస్తాలో మాత్రం నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక రేపు, ఎల్లుండి అక్కడ పొడి వాతావరణం ఉంటుందని, వర్షాలు పడే అవకాశం లేదని పేర్కొంది. ఇక రాయలసీమలో కూడా నేడు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలలో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు కురవగా, నిన్న కూడా ఈ జిల్లాలలో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి.
తెలంగాణాలో నో రెయిన్
రేపు ఎల్లుండి వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక వర్షాలపై ఎటువంటి హెచ్చరికలు లేవని వెల్లడించింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం పొడిగా ఉంటుందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఉదయం సమయంలో హైదరాబాద్లో పొగ మంచు ఉండే అవకాశం ఉందని, హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుందని పేర్కొంది.
చలిగాలులు, పొగమంచుపై వాతావరణ నివేదిక
ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు 4 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొత్తంగా తెలంగాణా రాష్ట్రంలో చలిగాలులు, పొగ మంచు తప్ప వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications